అకాల వర్షం.. తడిసిన ధాన్యం
● కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన నీరు ● వరదలో కొట్టుకుపోయిన వడ్లు
చెన్నూర్‌రూరల్/భీమిని/భీమారం/బెల్లంపల్లిరూరల్/మందమర్రిరూరల్/వేమనపల్లి: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షానికి పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. చెన్నూర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి, సుందరసాల తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా వర్షం కురిసే సరికి రైతులు ధాన్యంపై కవర్లు కప్పారు. అయినప్పటికీ ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లోనూ నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి చేతికొచ్చిన ధాన్యం తడిసిపోకుండా రైతులు పడరాని కష్టాలు పడ్డారు.
● భీమారం మండలంలో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి చెరువులా మారాయి. వరి ధాన్యం వరద నీటిలో ఉండిపోయింది. కొత్తగూడెం సమీపంలో ఆరబోసిన ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం సాయంత్రం వరకు ఆరబెట్టి ఇంటికి వెళ్లి పడుకున్నామని, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది.
● బెల్లంపల్లి మండలం మాలగురిజాల, చంద్రవెల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల్లో వరి ధాన్యం తడిసింది. ధాన్యంపై కవర్లు కప్పి తడవకుండా ఉండడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
● మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన, తూకం వేసిన బస్తాల్లోని ధాన్యం తడిసింది. గత 20రోజుల క్రితం తీసుకొచ్చి కేంద్రంలో ఆరబోస్తే ఇప్పటికే నాలుగైదుసార్లు కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొంత కొట్టుకుపోయింది. రెండ్రోజుల క్రితం బస్తాల్లో నింపి తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉంచగా.. మళ్లీ తడిసింది. బస్తాల్లో నుంచి బయటకు తీసి ఆరబోయడంతో కష్టం వృథా అవుతోందని, హమాలీ చార్జీ రెట్టింపు అవుతున్నాయని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రం నుంచి 17లారీల ధాన్యం తరలించగా.. ఇంకా సుమారు 20లారీల ధాన్యం ఉంది. వర్షానికి తడిసిపోతోంది.
● వేమనపల్లి మండలంలో అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యపు రాశులు ఉండగా గాలులకు టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. వర్షానికి వడ్లు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు పగలంతా రైతులు తంటాలు పడ్డారు.
కోటపల్లిలో..
కోటపల్లి: మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోటపల్లి, సర్వాయిపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో ఆలస్యం కావడంతో తడిసి పోయింది.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
అకాల వర్షం.. తడిసిన ధాన్యం


