మహాప్రస్థానం నిర్మాణంలో అక్రమాలు
● రూ.4కోట్లతో నిర్మిస్తామని రూ.11కోట్లు బిల్లు ● మట్టి అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ● మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానం నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, రూ.4కోట్లతో నిర్మిస్తామని ప్రకటించి బిల్లును రూ.11కోట్లకు మార్చారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శనివారం దివాకర్‌రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పాలనలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహాప్రస్థానం పేరుతో గోదావరినదిలో ఇసుక, మట్టిని మైనింగ్, ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా తరలించారని విమర్శించారు. మట్టి తరలించే టిప్పర్ల యజమాని ఇసుక, మట్టి బయట అమ్ముకునే విధంగా, ఇతర చెరువుల మట్టిని అక్రమంగా అమ్ముకునే విధంగా ప్రోత్సహించి అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా సిఫారసు చేశారని ఆరోపించారు. మహాప్రస్థానంలో జరిగిన అవినీతి, అక్రమాలపై, సహకరించిన అధికారులపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. జిల్లాకు తలమానికమైన అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో సీఎం కేసీఆర్ రూ.164 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేశారని, టెండర్, స్థల సేకరణ, ఒప్పందం పూర్తయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే బ్రిడ్జిని రద్దు చేయించి తాము తెచ్చిన నిధులను మళ్లించి లక్ష్మి టాకీస్ నుంచి రాళ్లవాగు మీదుగా పాత మంచిర్యాల ఆర్‌అండ్‌బీ రోడ్ వరకు మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన నిధులతో పనులు చేస్తూ తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. క్యాతన్‌పల్లి నుంచి ఐబీ వరకు రూ.35 కోట్లతో రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేస్తే అదే పని, అవే నిధులు పేరు మార్చి మళ్లీ శంకుస్థాపన చేశారని అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు మంజురు చేయించారని ప్రశ్నించారు. ప్రతీ పనికి కమీషన్లు తీసుకునే ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కరేనని ఆరోపించారు. ఆయన చెప్పిందే వేదం, ఆయనకు ఎవరైన ఎదురు మాట్లాడితే దాడులు చేయించడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్‌కుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


