కాలం వెనక్కిపోతే బాగుండు
మంచిర్యాల అర్బన్:
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఆసిఫాబాద్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ నీళ్లు దొరకని సందర్భంలో ఎండ్లబండ్లపై బిందెలు పెట్టుకుని చెలిమెలు తోడి నీళ్లు తెచ్చిన సందర్భాలెన్నో. మక్కజొన్న గట్కా, చిక్కుడు, గుమ్మడి కూర, పచ్చి కూరగాయలు దొరకని సందర్భంలో రకరకాల వరుగులతో అమ్మమ్మ వంటలు ఎంతో మధురంగా చేసేది. రాత్రివేళ పెరట్లో నులక మంచాల్లో పడుకుని వెన్నెల, నక్షత్రాలను చూస్తుండేవాళ్లం. కూని రాగాలు తీస్తూ ఆదమరిచి నిదురించేవాళ్లం. అమ్మమ్మ–తాతయ్య కథలు, కావ్యగానాలు అపూర్వమైనవి. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా ఎడ్లబండి కట్టుకుని వెళ్తుండగా ఒక ఎద్దు తప్పించుకుంది. అప్పుడు అందరం కలిసి బండిని లాక్కు ని వచ్చి అదే స్థలంలో ఉంచేవాళ్లం. ఈతకు వెళ్లి నీటిలో మునిగి పోతుంటే తమ్ముళ్లు కాపాడిన విషయం ఎప్పటికీ మరిచిపోను. గ్రామంలో రాత్రివేళ ప్రదర్శించిన రామాయణం, డ్రామాలను ఇంటిల్లిపాదితో కలిసి చూడటం మరిచిపోని జ్ఞాపకాలు. ఒక్కసారి కాలం వెనక్కిపోతే బాగుండు అనిపిస్తోంది.
– వామన్‌రావు, కవి, సాహితీ సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల


