
‘ఉపాధి’లో పండ్ల తోటలు
● జిల్లాలో 400 ఎకరాలు లక్ష్యం
● రైతులు ముందుకు రావాలని అధికారుల సూచన
చెన్నూర్‌రూరల్: కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవనాల పెంపకం చేపట్టేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి నిర్ణయించింది. జిల్లాలో 16మండలాలు ఉండగా.. మండలానికి 25ఎకరాల చొప్పున పండ్ల మొక్కలు పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలు ముగిసినందున ఎవరైనా ఆసక్తి కలిగిన చిన్న, సన్నకారు రైతులు ముందుకు వస్తే ప్రోత్సాహం అందించనున్నారు. ఉద్యానవన పంటల సాగులో భాగంగా మామిడి, బత్తాయి, నారింజ, జామ, సీతాఫలం, యాపిల్, కొబ్బరి, దానిమ్మ, మునగ, చింత, ఆయిల్‌ఫాం వంటివి రైతులు తమ భూముల పరిస్థితికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా ఒకే రకం సాగు చేసుకోవాల్సి ఉండగా.. అందుకు నిర్ణీత ధరలు చెల్లిస్తారు. రైతులు తమకు నచ్చిన నర్సరీల్లో ఎంపిక చేసుకోవచ్చు లేని పక్షంలో ప్రభుత్వం ఎంపిక చేసిన నర్సరీల నుంచి తీసుకోవచ్చు. స్వయంగా కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ముందస్తుగా బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకుంటే 90శాతం సబ్సిడీపై పరికరాలు అందజేస్తారు.
ధ్రువీకరణ పత్రాలు
చిన్న, సన్నకారు రైతులు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండి పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ ఇవ్వాలి. వ్యవసాయ పొలాల వద్ద నీటి వసతి కలిగి ఉండాలి. ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ఉద్యానవనాలు మంజూరు చేస్తారు. మొక్కలకు నిధులతోపాటు గుంతలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులు ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతారు.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి
ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యావన పంటలతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి లక్ష్యం ఉంది. రైతులు ముందుకు రావాలి.
– కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల

‘ఉపాధి’లో పండ్ల తోటలు