
విఘ్నేశ్వరాయా.. విభిన్న రూపాయ..
మంచిర్యాలఅర్బన్/నిర్మల్‌టౌన్/భైంసా/ ఆసిఫాబాద్ అర్బన్: నవరాత్రోత్సవాలకు గణేశ్ ప్రతిమలు ఆకర్షణీయమైన రూపాల్లో ముస్తాబవుతున్నాయి. నాలుగైదు నెలల క్రితం జగిత్యాల, మ హారాష్ట్ర, రాజస్థాన్ నుంచి మంచిర్యాలకు వచ్చిన పలు కుటుంబాలవారు విగ్రహాలు తయారు చేస్తున్నారు. జీరో సైజు నుంచి నుంచి 12అడుగుల విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. వినాయక చవితి మరో ఐదురోజులు మాత్రమే ఉండగా గణనాథులకు తు దిమెరుగులు దిద్దుతున్నారు. మరికొందరు వ్యాపారులు దూరప్రాంతాల నుంచి విగ్రహాలను తెప్పించి విక్రయిస్తున్నారు. ఇంకొందరు ఇతర ప్రాంతాల నుంచి కళాకారులను రప్పించి మంచిర్యాలలోనే గణనాథులను తయారు చేయిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 35 ఏళ్లుగా రాజస్థాన్ కళాకారులు గణేశ్, దుర్గామాత తదితర విగ్రహాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సుమారు వెయ్యి మంది వరకు కళాకారులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఫీట్ నుంచి 25 ఫీట్ల దాకా, రూ.50 నుంచి రూ.2లక్షల విలువ చేసే విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటికే 90శాతం విగ్రహాలు అమ్ముడైనట్లు విక్రయదారులు, వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. భైంసా పట్టణంలో 20ఏళ్లుగా రాజస్థాన్ నుంచి వస్తున్న పది కుటుంబాలవారు విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నారు. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామంలో ఇజ్గిరి ముత్తన్న కుటుంబం 15ఏళ్లుగా విగ్రహాలు తయారు చేస్తోంది. ముత్తన్న ఇద్దరు కొ డుకులు కూడా విగ్రహాలను తయారు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మట్టి వినాయకులను తయారు చేసి విక్రయించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనూ విగ్రహా లు తయారు చేస్తున్నారు. కుభీర్‌కు చెందిన శ్యామ్ 14 ఏళ్లుగా శిల్పకళాధామంలో 3 నుంచి 12 అడుగుల ఎత్తు విగ్రహాలు తయారు చేసి రూ.3వేల నుంచి రూ.35 వేల వరకు విక్రయిస్తున్నాడు. కాగా, భైంసా పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో కుల సంఘాలు, యువజన సంఘాలు ప్రతిష్ఠించే భారీ విగ్రహాలను ఇతర పట్టణాల నుంచే తయారు చేయించి తీసుకువస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన కళా కారులు 20 ఏళ్లుగా స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 10 నెలలపాటు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. పురుషులు పీవోపీతో విగ్రహాలు తయారు చేస్తే.. మహిళలు, పిల్లలు వాటికి రంగులద్దుతారు. సైజు, రూపాన్ని బట్టి ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. 3 నుంచి 15 ఫీట్ల ఎత్తు విగ్రహాలు తయారు చేసి రూ.5వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయిస్తున్నట్లు వారు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో సుమారు నాలుగైదు విగ్రహాల తయారీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 50 వరకు వివిధ ఆకృతులు, రంగుల్లో విగ్రహాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కళాకారులు వారు తయారు చేసిన విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతుండగా భక్తులు ఇప్పటికే వారికి కావాల్సిన విగ్రహాలను బుక్ చేసుకుంటున్నారు.