
● గోలేటిలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ష
నేటి నుంచి క్రీడా సంబురం
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో శనివా రం నుంచి ఆదివారం వరకు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా బాల్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఇందుకు ముస్తాబైంది. వీక్షకుల కోసం టెంట్లు వేశారు. మైదానం చుట్టూ రంగురంగుల జెండాలు పాతి అందంగా ముస్తాబు చేశారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.
240 మంది క్రీడాకారుల రాక
జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, షార్ప్‌స్టార్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 71వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్ర వ్యా ప్తంగా 240 మంది క్రీడాకారులు హాజరు కానున్నా రు. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి పురుషుల జట్లు, మెదక్ మినహా మిగతా జిల్లాల నుంచి మహిళల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. ఇందుకు సుమారు 10 మంది రెఫరీలు, 50 మంది రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ సభ్యులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. మహిళా క్రీడాకారుల కోసం సింగరేణి ఉన్నత పాఠశాల, పురుష క్రీడాకారుల వసతి కోసం ఎన్‌సీ టైపు, సీ2 టైపు క్వార్టర్లు, రెఫరీల కోసం సీఈఆర్ క్లబ్‌ను కేటాయించారు. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల క్రీడాకారులు తరలిరాగా రాత్రి వరకు మిగతా జిల్లాల క్రీడాకారులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, గడ్డం వినో ద్, పాల్వాయి హరీశ్‌బాబుతో పాటు బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరు కానున్నారు. ముగింపు కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ హాజరవుతారు. ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి పరిశీలించారు. క్రీడాకారులు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.