గ్యారంటీ గండం..! | - | Sakshi
Sakshi News home page

గ్యారంటీ గండం..!

Apr 24 2025 12:21 AM | Updated on Apr 24 2025 12:21 AM

గ్యారంటీ గండం..!

గ్యారంటీ గండం..!

● ఇప్పటికీ 9మిల్లులకే ‘సీఎంఆర్‌’కు అనుమతి ● గత సీజన్‌ నుంచే తగ్గుతున్న మిల్లులకు ట్యాగింగ్‌ ● ఈ యాసంగిలో పొరుగు జిల్లాలకు పంపే యోచన ● జిల్లా మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని వేడుకోలు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బ్యాంకు గ్యారంటీ మెలిక మిల్లర్లకు గండంలా మారింది. రా మిల్లర్లు, కొత్తగా పరిశ్రమలో చేరిన వారికి మరింత ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లు మొదలైనా సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) మిల్లులకు ట్యాగింగ్‌ ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మిల్లర్లు రూ.కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ట్యాగింగ్‌ కావడం లేదు. నిబంధన ప్రకారం పది శాతం గ్యారంటీ ఇస్తేనే ధాన్యం అప్పగించాలి. పాత బకాయి ఉంటే మరో 20 శాతం అదనం. గత సీజన్‌ నుంచే సర్కారు కఠినంగా ఈ నియమం అమలు చేస్తోంది. దీంతో గత వానాకాలం నుంచే జిల్లాలో అనేక మంది మిల్లర్లు సీఎంఆర్‌కు దూరమయ్యారు. ఇక 2022–23 యాక్షన్‌ ధాన్యంకు సంబంఽధించి రూ.87 కోట్ల బకాయి ఉంది. మరోవైపు సీఎంఆర్‌ జాప్యం చేసిన 20 మిల్లులపై ఆర్‌ఆర్‌, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విలువ రూ.133.78 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ లెక్కగట్టింది. ఆ డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. బాయిల్డ్‌తో పోలిస్తే రా రైస్‌ మిల్లర్లు గత సీజన్‌ నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సేకరణకు ఇబ్బంది లేకుండా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 56 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 9 మిల్లులకే ట్యాగింగ్‌ ఇచ్చారు. మరో రెండు మిల్లులకు ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో ధాన్యం పెద్దఎత్తున కేంద్రాలకు రానుంది. దీంతో ఆలస్యమైతే రైతులు ఇబ్బంది పడనున్నారు.

పొరుగు జిల్లాకు ధాన్యం

ఈ యాసంగిలో జిల్లాలో 1.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 3.41లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా ఉంది. మొత్తం 321 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఇప్పటికే 4వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. గత వానాకాలంలోనే గ్యారంటీలు ఇవ్వకపోవడంతో కరీంనగర్‌ జిల్లా మిల్లులకు ఇక్కడి ధాన్యాన్ని తరలించారు. ఈ నెల నుంచే రేషన్‌ షాపులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో రాష్ట్రస్థాయిలో బఫర్‌ స్టాక్‌తో చేసుకోవాల్సి ఉంది. వారంలో ధాన్యం రాక ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలకు ధాన్యం పంపేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల అనుమతి కోరారు. స్థానిక గోదాముల్లో నిల్వ సామర్థ్యం సైతం పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఇతర జిల్లాలకు పంపే యోచన చేస్తున్నారు.

మిల్లర్ల వేడుకోలు

బకాయిలు చెల్లించేందుకు ‘అండర్‌ టేకింగ్‌ తీసుకుని ధాన్యం కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే మూడు నెలలపాటు సమయం ఇవ్వగా జిల్లా మిల్లర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పొరుగు జిల్లాలకు ధాన్యం పంపితే అక్కడ తరుగు కటింగ్‌ చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ధాన్యం రవాణా ఖర్చు పెరుగుతుందని, ఇబ్బందులు వస్తాయంటున్నారు. కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్‌ నిలిచిపోయిందని, రూ.కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న రైస్‌మిల్లర్లకు, ఉపాధికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారంటీ, బకాయిలు తీర్చిన వాటికే ధాన్యం అప్పగిస్తున్నామని, ఆ మేరకు తమ బకాయిలు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement