
మాలగురిజాలలో వైద్య శిబిరం
● కిడ్నీ వ్యాధిగ్రస్తుల వ్యఽథను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ● వ్యాధిగ్రస్తుల వివరాలు ఆరా తీసిన వైద్యులు ● ప్రజలకు పరీక్షలు, మాత్రలు పంపిణీ ● మూత్ర, రక్త నమూనాల సేకరణ
బెల్లంపల్లి: మండలంలోని మాలగురిజాల గ్రామంలో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతుండగా.. శుక్రవారం ప్రభుత్వ వైద్యులు సందర్శించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘మాలగురిజాలకు కిడ్నీ గండం’ శీర్షికన ఈ నెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలు చెడిపోయి డయాలసిస్‌కు చేరి మృతిచెందడం, కొందరు మంచం పట్టిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్‌రాజ్ బెల్లంపల్లి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌నాయక్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందిని గ్రామానికి పంపించారు. వైద్య శిబిరం నిర్వహించి 52మందికి పరీక్షలు చేయగా.. వీరిలో 10మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అనంతరం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆందోళనకు గురి కావద్దని డాక్టర్ సుధాకర్‌నాయక్ అన్నారు. గ్రామంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి, ఎంతకాలం నుంచి జబ్బుతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు రోజువారీగా నీటిని తాగుతున్న రెండు చేతిపంపుల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆయా చేతిపంపుల నీటిని పరీక్షల నిమిత్తం వరంగల్‌లోని లాబోరేటరీకి పంపిస్తామని ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ తరఫున గ్రామంలో మూడు రోజులపాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. నాలుగు బృందాలతో గ్రామంలోని 250 ఇళ్లు, 912 మంది జనాభాకు వైద్యపరీక్షలు చేయనున్నారు. ప్రతీ ఒక్కరి రక్త, మూత్ర నమూనాలను సేకరించి టీహబ్‌లో పరీక్షించనున్నారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ ఎవంజలెన, జిల్లా మాస్‌మీడియా అధికారి బి.వెంకటేశ్వర్, సీహెచ్‌ఓ వెంకటేశ్వర్, సూపర్‌వైజర్ మల్లిక, ఎంపీహెచ్‌ఏ శివగనేశ్వరరావు, ఏఎన్‌ఎం చంద్రకళ, ఆశ కార్యకర్త రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

మాలగురిజాలలో వైద్య శిబిరం