కొందరికే కుట్టు పని..!
● స్కూల్ యూనిఫాం కుట్టు పని నిబంధనలు గల్లంతు ● అర్బన్ ప్రాంతంలో గంపగుత్తగా అప్పగింత ● ఒక్కో మహిళా గ్రూపునకు ఆరు నుంచి పదికి పైగా పాఠశాలలు ● అస్పష్ట కొలతలతో ఇబ్బందులు
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్న యూనిఫాంలు కొలతల ఆధారంగా కుట్టాల్సి ఉన్నా అలాంటిదేమీ కనిపించడం లేదు. గత ఏడాది జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫాంలు పొట్టిగా, పొడుగ్గా, జేబులు ఊడిపోయి, దారం పోగులు లేచి అసౌకర్యంగా ఉన్నాయి. కొన్ని బడుల్లో కొలతలు తారుమారైన విషయాన్ని గ్రహించి అధికారులు దుస్తులను వెనక్కి పంపించారు. కొందరికి ఒక జత దుస్తులు అందగా.. మరో జత మూడు నెలలు దాటిన తర్వాత అందజేశారు. ఈసారి బడులు తెరిచే నాటికే యూనిఫాం అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారుల మధ్య సమన్వయ లోపమో.. ఏమో గానీ ఆరు నుంచి పదికి పైగా పాఠశాలలను గంపగుత్తగా ఒకే ఏజెన్సీ(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు కుట్టుపని అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది.
జిల్లాలో..
జిల్లాలో అర్బన్ ప్రాంతంలో 138 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,866 మంది విద్యార్థులు ఉండగా.. బాలురు 6,247మంది, బాలికలు 7,619 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని 630 పాఠశాలలల్లో 28,845మంది విద్యార్థులు ఉండగా.. బాలురు 13,774మంది, బాలికలు 15,071 మంది ఉన్నారు. జిల్లాలోని 10,417 సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల్లో 1,15,018మంది మహిళా సభ్యులు ఉన్నారు. కుట్టు పని నైపుణ్యం కలిగిన గ్రూపులను గుర్తించి ఆయా పాఠశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం వస్త్రం అప్పగించారు. ఒక్కో ఏజెన్సీ(మహిళా గ్రూపు)కి ఒక్కో పాఠశాల మాత్రమే అప్పగించాలి. కానీ అర్బన్ ప్రాంతంలో కొందరికే గంపగుత్తగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఎస్‌హెచ్‌జీకి ఒకటి కంటే ఎక్కువ స్కూళ్ల విద్యార్థుల దుస్తులు కుట్టడానికి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిర్యాల అర్బన్ ప్రాంతంలో 31 పాఠశాలల్లో మూడు మినహా 22 పాఠశాలలు ఒకే సెల్ఫ్‌హెల్ప్ గ్రూపునకు అప్పగించారు. మరో ఏజెన్సీకి 6, ఇంకో ఏజెన్సీ 2, ఒక ఏజెన్సీకి ఒక బడి విద్యార్థుల యూనిఫాం కుట్టు బాధ్యతలు అప్పగించారు. చెన్నూర్‌లో 17పాఠశాలలు ఉండగా.. ఒకే గ్రూపునకు 11 పాఠశాలలు అప్పగించారు. నస్పూర్‌లో 17 పాఠశాలలను ఒకే గ్రూపునకు అప్పగించా రు. ఇందులో ఏడు పాఠశాలలు ఒక మహిళకు, ఐదే సి పాఠశాలలు మరో ఇద్దరికి బాధ్యతలు ఇచ్చారు. బెల్లంపల్లిలో 20 పాఠశాలలు ఉండగా 13 ఒక గ్రూపునకు, ఐదు మరో గ్రూపునకు ఇచ్చినా మహిళా సభ్యులు ముగ్గురు ఉన్నారు. క్యాతన్‌పల్లిలో 12 పాఠశాలల్లో 11 ఒకే గ్రూపునకు, లక్సెట్టిపేటలో 21 పాఠశాలలు ఉండగా.. 11 ఒక ఎస్‌హెచ్‌జీ మహిళకు ఆరు, మరో మూడు గ్రూపునకు కట్టబెట్టారు. మందమర్రిలో 19పాఠశాలల్లో ఎనిమిదింటిని ఒక గ్రూపునకు అప్పగించారు. ఒక్కో తరగతిలో ఒకే ఎత్తు కలిగిన ఐదుగురు విద్యార్థులకు ఒకే కొలతలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా దర్జీలకు గంపగుత్తగా అప్పగించడం వల్లనే యూని ఫాం కొలతల్లో తేడా, నాణ్యమైన కుట్టు లేక దుస్తులు వేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డా రు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ప్ర భుత్వ ఆశయాన్ని నీరుగార్చి కొందరికే అప్పగించిన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎస్‌హెచ్‌జీకి ఒకే పాఠశాల బాధ్యతలు
సెల్ఫ్‌హెల్ప్ గ్రూపునకు ఒక్క పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు బాధ్యతలు అప్పగించాలి. ముందస్తుగా సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మ్యాపింగ్ చేశాం. నైపుణ్యం కలిగిన మహిళలకు శిక్షణ ఇచ్చాం. ఒకటి కంటే ఎక్కువగా గ్రూపునకు అప్పగించినట్లు మా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు చేపట్టి మార్పులు చేస్తాం.
– డీఆర్‌డీవో కిషన్


