గుండెపోటుతో సింగరేణి అధికారి మృతి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలోని ఐఈడీ విభాగం డీజీఎం కే.చిరంజీవులు గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం సాయంత్రం ఇల్లందు క్లబ్‌లో షటిల్ ఆడి ఇంటికి వెళ్లి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. తీవ్ర చెమటలు వచ్చిన ఆయనను భార్య జ్యోతి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) అరవిందరావు పరామర్శించారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల ప్రాంతానికి తీసుకెళ్లారు. చిరంజీవికి భార్య జ్యోతి, కుమారుడు వినీత్, రోహిత్ ఉన్నారు. వినీత్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, రోహిత్ జార్జీయ దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. నిత్యం షటిల్ ఆటతోపాటు ఎంతో ఫిట్‌గా ఉండే చిరంజీవులు గుండెపోటుతో మృతిచెందడం అధికారులు, కార్మికుల్లో తీవ్ర విషాదం నింపింది.


