● రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు ● రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
నిర్మల్‌చైన్‌గేట్/సిరికొండ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొని తమ కాళ్లపై తాము నిలబడి తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయనున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,600 మంది యువతీ, యువకులకు ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.
మూడు కేటగిరీల్లో ఆర్థిక సహాయం..
కేటగిరీ– 1, 2, 3 వారీగా యువతకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కేటగిరీ –1 కింద రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూర్చుతుంది. 20 శాతం నగదును లబ్ధిదారులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ –2 కింద రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 70 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగితా 30శాతం లబ్ధిదారులు సమకూర్చుకోవాలి. కేటగిరీ 3 కింద రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 60 శాతం ప్రభుత్వమే సబ్సిడీ సమకూర్చనుండగా లబ్ధిదారులు 40శాతం భరించాల్సి ఉంటుంది. కేటగిరీ –1 కింద సహాయం పొందదల్చుకున్నవారు రూ. 20వేలు, కేటగిరీ –2 కింద సహాయం పొందదల్చుకున్నవారు రూ. 30వేల వరకు, కేటగిరీ 3 కింద సహాయం పొందదల్చినవారు రూ. 40వేల వరకు తమ వంతు పెట్టుబడిని స్వయంగా కానీ బ్యాంకుల నుంచి కానీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తాము నెలకొల్పదల్చుకున్న యూనిట్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సంబంధిత కార్పొరేషన్లతోపాటు కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయిలోని అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది.
మంజూరులో జాప్యం..
గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరులో జాప్యం జరగడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురయ్యారు. అయితే వరుస ఎన్నికలు వచ్చిన స మయంలో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రు ణాల మంజూరు ఉంటుందనుకున్నారు. కానీ వరు స ఎన్నికల నేపథ్యంలో రుణాలకు బ్రేక్ పడింది.
దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు..
తెలంగాణకు చెందిన స్థిరనివాసై ఉండాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
నిరుద్యోగ యువతీయువకులకు మాత్ర మే అవకాశం ఉంటుంది.
ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాలి.
రేషన్‌కార్డు, ఎంప్లాయీమెంట్ ఎక్సేంజ్‌లో పేరు నమోదై ఉండాలి.
ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ..
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో భాగంగా మార్చి 17న దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆర్థిక సహాయం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతీ యువకులు చేస్తున్న దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి మే 31వరకు పరిశీలించి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు.