
ఈశ్వర్ సమక్షంలో చేరుతున్న సురేందర్‌రెడ్డి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ మాజీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. శుక్రవారం ఆయన పెద్దపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో యూనియన్ కండువా కప్పుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేయడం లేదని నాయకత్వం అప్పట్లో ప్రకటించడంతో ఐఎన్టీయూసీలో చేరారు. ఐఎన్టీయూసీలో నాయకత్వం నచ్చకపోవడం, టీబీజీకేఎస్ నుంచి ఆహ్వానం రావడంతో తిరిగి మాతృ సంఘంలో చేరినట్లు ఆయన తెలిపారు. శ్రీరాంపూర్ నుంచి ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచీ నాయకులు పాల్గొన్నారు.
హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆధ్వర్యంలో గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో నిర్వహిస్తున్న వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషన్ ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 11జట్లు పోటీలకు హాజరు కాగా అన్ని జట్ల క్రీడాకారులు అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. నాక్ అవుట్ పద్ధతిలో మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. 11 జట్లలో నుంచి కామారెడ్డి, హైదరాబాద్, సోమగూడెం, బెబిన్ హైదరాబాద్ క్లబ్ జట్లు సెమీ ఫైనల్ పోటీలకు ఎంపికై నట్లు నిర్వహకులు తెలిపారు. శనివారం భీమన్న స్టేడియంలో సెమీ ఫైనల్‌తో పాటు ఫైనల్ పోటీలు నిర్వహించేందుకు ఏరియా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు ఫైనల్ పోటీలను పూర్తి చేసి అనంతరం విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేయనున్నుట్లు నిర్వహకులు తెలిపారు.

తలపడుతున్న క్రీడాకారులు