● బాలికలకు ఆత్మరక్షణ విద్య ● మూడు నెలలపాటు శిక్షణ
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలికలకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ నిర్బర్ పేరుతో అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పాఠశాలల్లో బాలికలకు కరాటేలో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తరగతులు పూర్తయిన తర్వాత సాయంత్రం గంటపాటు ఆత్మరక్షణ పాఠాలు బోధించి ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో మెళకువలు నేర్పిస్తారు. ఆకతాయిల ఆగడాల నుంచి బాలికలు తమను తాము రక్షించుకోవడం, శారీరక ధృడత్వం సాధించడం, మానసికోల్లాసం కలిగించేందుకు ఆత్మరక్షణ విద్య ఎంతో దోహదం చేయనుంది.
మూడు నెలలు..
పాఠశాల స్థాయిలోనే బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్పించడం ద్వారా మానసిక ధైర్యం పెంపొందుతుంది. ఆత్మరక్షణ విద్యను జిల్లాలోని మొత్తం 82 పాఠశాలల్లో మూడు నెలలపాటు అమలు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు–5, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలు–77 ఉన్నాయి. ఈ పాఠశాలలో చదువుకునే బాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తారు. ఒక్కో పాఠశాలల్లో శిక్షకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. వీరికి నెల రోజులకు రూ.5వేలు వేతనం ఇవ్వనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాఠశాల సమయం ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల్లోపు ఎప్పుడైనా విద్యార్థులకు చదువులకు అంతరాయం కలుగకుండా నేర్పిస్తారు.
శిక్షణలో జాప్యం..
ఆత్మరక్షణ విద్య శిక్షణలో ఆలస్యం జరుగుతుంది. ముందుగా అక్టోబర్ 1నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. దసరా సెలవులకు రెండు రోజులకు ముందుగా ఉత్తర్వులు అందాయి. కరాటే శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసిన శిక్షకులకు రూ.5వేలు పారితోషికం ప్రభుత్వం అందజేయనుంది. ఈ లెక్కన మూడు నెలలపాటు రూ.15వేలు గౌరవ భృతి అందజేయనున్నారు. వారంలోపు శిక్షణ ప్రారంభం కానుందని ఇంచార్జీ సెక్టోరల్ అధికారి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ప్రస్తుతం శిక్షకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, పూర్తి కాగానే శిక్షన ప్రారంభించనున్నారని తెలిపారు. శిక్షణ ప్రారంభ తేదీ నుంచి మూడు నెలలపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.