జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీలో దారుణం | - | Sakshi
Sakshi News home page

జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీలో దారుణం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఫ్రీజర్‌ పనిచేయక మృతదేహాలు పాడయ్యాయంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం మార్చురీలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న ఘటన మరువకముందే మరోసారి ఈ ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆరు రోజుల క్రితం కావేరమ్మపేట వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారం బాదేపల్లి పాతబజార్‌కు చెందిన చేగొళ్ల రాములు (55) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని కూడా అదే మార్చురీలోని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అయితే శుక్రవారం రాత్రి ఎంసీబీ ట్రిప్‌ కావడంతో ఫ్రీజర్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో మృతదేహాలు పాడయ్యాయని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పోస్టుమార్టం కోసం వచ్చిన రాములు కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహం గట్టిపడటాన్ని గమనించి సిబ్బందిని నిలదీశారు. మార్చురీలో భద్రపరిచినా ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న వైద్యుడు డాక్టర్‌ సత్యనారాయణ వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఫ్రీజర్‌లో కొంతసేపు శీతలీకరణ ఉంటుందని వివరించినట్లు తెలిసింది. సాంకేతిక అంశాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు.

సాంకేతిక లోపంతోనే సరఫరా నిలిచింది

మార్చురీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై స్థానికులు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హర్షదుల్లాను వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నానని, సిబ్బందిని విచారించి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. గురువారమే విద్యుత్‌ బోర్డులు మార్చి ఎంసీబీ అమర్చారని, సాంకేతిక కారణాలతో అది ట్రిప్‌ కావడంతో శుక్రవారం రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది తెలిపినట్లు వివరించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం మార్చురీకి తీసుకొచ్చేసరికే కొంత పాడైందని, దాదాపు ఏడు రోజులు కావడంతో దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో

పనిచేయని ఫ్రీజర్‌.. కుళ్లిన మృతదేహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement