● ఇండెంట్ నీరు అందక 20 ఎకరాల వరికి నిప్పు
● అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదంటూ రైతు ఆవేదన
మాన్‌దొడ్డిలో పంటను తగలబెడుతున్న రైతుమోహన్ సాగర్
రాజోళి: సాగునీటి కోసం ఎదురుచూసి.. పంట ఎండిపోతుండటాన్ని చూసి తట్టుకోలేక ఓ రైతు తన వరి పంటకు నిప్పంటించాడు. గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డికి చెందిన కృష్ణ మోహన్ సాగర్ సొంత భూమితోపాటు కౌలుకు తీసుకున్న భూమిలోనూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. నెల రోజులుగా ఇండెంట్ నీటి కోసం ఎదురుచూస్తున్నా సరఫరా కాలేదు. నదిలో నీరు లేకపోవడం, అధికారులు హామీ ఇచ్చిన నీరు అందకపోవడంతో పంట ఎండిపోతోందని పలుమార్లు అధికారులకు, స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించాడు.. అయినా స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతుండటాన్ని చూసి తట్టుకోలేక శనివారం తన పంటకు నిప్పంటించాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున 20 ఎకరాలకు పెట్టుబడి పెట్టానని, సాగునీరు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆరైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లముందే పంట అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసిన స్థానిక రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.


