కందనూలు: గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా నిర్వహిస్తున్న కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవానికి శనివారం ఆయన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత 28 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్న ఈ కేంద్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి చొరవతో మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కంటి చూపు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనదని, దృష్టి సమస్యలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ, సామాజిక జీవితాలపైనా ప్రభావం చూపుతాయని తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షలతో వ్యాధులను తొలిదశలో గుర్తించి సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు. వైద్య సేవలతోపాటు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
మరింత మందికి సేవలు అందించాలి
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడంలో ఐ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తన తండ్రి పేరుతో నిర్వహిస్తున్న కేంద్రం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగడం సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. సంస్థ సేవలను మరింత విస్తరించి, ఎక్కువ మందికి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు నగదు బహు మతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, తహసీల్దార్ తబితా రాణి, గ్రామ సర్పంచ్ లక్ష్మి, కరుణాకర్‌రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


