జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరణ శాశనం లిఖించే డిండి ప్రాజెక్టును రద్దు చేయకుంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి పాలమూరు బలి అయిందని, రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పేరుతో ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరును ఎండబెట్టే ఏ నిర్ణయాన్ని సమర్థించమని హెచ్చరించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనురుధ్‌రెడ్డి బాటలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అధికంగా నిధుల కేటాయించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టుకు 17.8 టీఎంసీలు, నెట్టెంపాడుకు 22 టీఎంసీలు, భీమా ఫేస్1, పేస్ 2 కు 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ 5 టీఎంసీల నికరజలాలు కేటాయించాలన్నారు. అనంతరం జేఏసీ కన్వీనర్ బెక్కం జనార్దన్ మాట్లాడారు. పోరాటాల వీరుడు పండుగ సాయన్న స్ఫూర్తితో పాలమూరు ప్రాజెక్టులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 22 నుంచి నవంబర్ 30 వరకు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సంతకాల సేకరణ కరపత్రాన్ని విడుదల చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుమారుడి అంత్యక్రియలు
వీపనగండ్ల: సీపీఎం నాయకుడు, కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే గఫూర్, నిర్మల దంపతుల కుమారుడు పీవీ కిరణ్ ఇటీవల అమెరికాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం మృతుడి అమ్మవారి స్వగ్రామమైన సంగినేనిపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జాతీయ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని వారి బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి గుండెపోటుతో మరణించడం వారి కుటుంబ సభ్యులకు తీవ్ర మనోవేదనను కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, మండల కార్యదర్శి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


