జిల్లా కేంద్రంలోని ఖౌమి ఏక్తా కమిటీ కులమతాలు, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తోంది. నగరంలోని అన్ని మతాల పండుగల్లో కులమతాలకతీతంగా శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో 1981 సంవత్సరంలో అధ్యక్షుడిగా షాబుద్దీన్ ఖాద్రీ, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఖౌమీ ఏక్తా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కమిటీ అధ్యక్షుడిగా భగవంతురావు, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ రఫీక్ పటేల్, ఉపాధ్యక్షుడిగా చంద్రకుమార్‌గౌడ్‌తోపాటు పలువురు సభ్యులుగా ఉన్నారు. మహబూబ్‌నగర్ ఖౌమి ఏక్తా కమిటీ ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. హిందూవుల దసరా పండుగ రోజు క్లాక్‌టవర్ వద్ద, ముస్లింల రంజాన్, బక్రీద్ పండుగల్లో ఈద్గా సమీపంలో, మిలాదున్నబీ రోజు అంబేడ్కర్ చౌరస్తా, క్రిస్మస్ పండుగ రోజు ఎంబీ చర్చి ఆవరణల్లో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తారు. ఆయా పండుగ రోజుల్లో వేదిక వద్దకు చేరుకొని కులమతాలకతీతంగా ప్రజలు పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఆనవాయితీగా వస్తోంది.


