పండగపూట తప్పని నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పండగపూట తప్పని నీటి కష్టాలు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

జడ్చర్ల టౌన్‌: దసరా పండగ వేళ తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాతబజార్‌ మహిళలు సోమవారం జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలు, చిన్నపిల్లలతో కార్యాలయానికి చేరుకున్న మహిళలు ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సిబ్బందిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే మల్లెబోయిన్‌పల్లి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు నీటి రాక తగ్గడంతో సమస్య తీవ్రతరమైంది. పాతబజార్‌లో పది రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్లాంట్‌కు రోజూ 11 ఎంఎల్‌డీ నీరు రావాల్సి ఉండగా, ఆదివారం కేవలం ఒక ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా అయింది. నాలుగైదు రోజులుగా నిర్దేశిత స్థాయిలో నీరు రాకపోవడంతో పలు కాలనీలకు సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా తగ్గడంపై మున్సిపల్‌ అధికారులు మిషన్‌ భగీరథ అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాచారం అందడం లేదని చెబుతున్నారు. సోమవారం ఉదయం ప్లాంట్‌కు నీటి సరఫరా పునఃప్రారంభమైనా, అన్ని కాలనీలకు సకాలంలో నీటిని అందించడం సాధ్యం కావడం లేదని అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తామని ఏఈ గాయత్రి వెల్లడించారు. సోమవారం 7, 23, 9వ వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ఇతర వార్డులకూ ట్యాంకర్లను పంపిస్తామని పేర్కొన్నారు.

● తాగునీటి కోసం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మహిళల ధర్నా

● ట్యాంకర్ల ద్వారా సరఫరాకు అధికారుల చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement