మిడ్జిల్: కేఎల్ఐ కాల్వలో యువ రైతు గల్లంతైన ఘటన సోమవారం మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లి శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గాజుల చెన్నకేశవులు (25) కేఎల్ఐ కాల్వలో సాగు నీటి కోసం బిగించిన మోటార్ నడువకపోవడంతో సోమవారం ఉదయం గ్రామ శివారులోని కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కొట్టుకుపోయాడు. మధ్యాహ్నం వరకు చెన్నకేశవులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా కాల్వ ఒడ్డుపైన దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బందితో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. రాత్రి కావడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టుతామని అధికారులు తెలిపారు.


