మహబూబ్‌నగర్ క్రైం: కేసుల నమోదులో ఏమాత్రం జాప్యం లేకుండా చర్యలు తీసుకోడంతో పాటు న్యాయ సహాయం అందించాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో బాధితులతో మాట్లాడుతూ వారి సమస్యలపై ఆరా తీశారు. ఆ తర్వాత సదరు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ కేసు నమోదు తీరు, ఇతర అంశాలపై తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు.


