● కోయిల్‌సాగర్ నుంచి వారం రోజుల పాటు నీటి విడుదల
● చివరి తడితోనైనా పంట
చేతికొస్తుందని అన్నదాతల ఆశ
దేవరకద్ర: ఎండిపోతున్న పంటలకు కోయిల్‌సాగర్ నీటి విడుదల ఊపిరిపోసింది. వర్షాభావ పరిస్థితులతో వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారి, నీరందక వాడిపోతున్న వరిపంటలకు నీరు విడుదల చేయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. చివరి తడి అందితేనైనా కొద్దో గొప్పో పంట చేతికి వస్తుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద సాధారణంగా వానాకాలంలో దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు జరిగేది. అయితే ఈసారి వర్షాలు సరిగా కురవకపోవడంతో అందులో సగం విస్తీర్ణంలోనూ సాగు జరగని పరిస్థితి నెలకొంది. చాలామంది రైతులు భూములను బీళ్లుగా వదిలేశారు. ప్రాజెక్టు సమీపంలోని బోరుబావుల కింద సాగు చేసిన పంటలకూ నీటి కొరత తప్పలేదు. ఈ నేపథ్యంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్పందించిన పాలకవర్గం వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా సోమవారం 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.6 అడుగుల నీటిమట్టం ఉండగా, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటలకు చివరి తడిగా కొంత నీటిని అందిస్తున్నారు. మరో రెండు వారాల్లో పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని, ఈ సమయంలో ఒక తడి నీరు అందితే తమకు కొంతైనా ఉపశమనం లభిస్తుందని రైతులు చెబుతున్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేసవిలో తాగునీటి అవసరాల కోసం నిల్వ చేసిన నీటిలో కొంత భాగాన్ని పంటలు ఎండిపోకుండా విడుదల చేసినట్లు మిషన్ కాకతీయ ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు. రోజుకు సుమారు మూడు ఇంచుల మేర నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని, వారం రోజుల పాటు నీటిని విడుదల చేస్తే దాదాపు రెండు అడుగుల మేర తగ్గవచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.


