జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): టీజీపీఎస్సీ నిర్వహించే అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్–2, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం అధికారులను ఆదేశించారు. ఈ నెల 24, 26 తేదీల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జయప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల, ఎం.ఎస్ ఏస్ ఇన్ఫోటెక్, ఫాతిమా విద్యాలయాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో మొత్తం 640 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను ముందుగానే నియమించాలని, సిబ్బంది కొరత లేకుండా అదనపు ఇన్విజిలేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీతోపాటు ఇతర సాంకేతిక సదుపాయాలను ముందుగా తనిఖీ చేసి, లోపాలుంటే వెంటనే సరిచేయాలన్నారు. అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల రవాణాకు ప్రత్యేక బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు సూచించారు. తనిఖీల అనంతరమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలని, మొబైల్ ఫోన్లు, ఇతర నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దన్నారు. పరీక్షల నిర్వహణపై ఎప్పటికప్పుడు నివేదికలు సేకరించి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హరిప్రియ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


