జగమేలు.. జోగుళాంబ | - | Sakshi
Sakshi News home page

జగమేలు.. జోగుళాంబ

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

● తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా జోగుళాంబ

● అత్యంత వైభవంగా శరన్న నవరాత్రి ఉత్సవాలు

● స్వామి, అమ్మవారి దర్శనానికి భారీగా తరలొచ్చిన భక్తులు

● జోగుళాంబ అమ్మవారి

ఆలంయలో ప్రత్యేక పూజలు

అలంపూర్‌: శక్తి స్వరూపిని సిద్ధిదాత్రి.. పాహిమాం అంటూ భక్తులు అమ్మవారిని శరణు కోరారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్న నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల 9వ రోజు సోమవారం జోగుళాంబ అమ్మవారు ిసిద్ధిదాత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో నవరూపాల్లో చివరి రోజు సిద్ధిదాత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. కొలువైన అమ్మవారికి అర్చకులు కుమారి పూజ, సువాసిని పూజ, మంత్రపుష్ప నీరాజనం, దశవిధ హారతులను అందజేశారు. శరన్నవరాత్రులలో చివరిరోజు జోగుళాంబను ిసిద్ధిదాత్రిగా ఆరాధిస్తారని అర్చకులు తెలిపారు. సకల సిద్ధులను ప్రసాదించే జగన్మాత సిద్ధిదాత్రిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తుందన్నారు. నవదుర్గలలో ఒకరైన సిద్ధిధాత్రిని ఆరాధించడంతో శరన్నవరాత్రుల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులకు వివరించారు.

మహార్ణవమి కాళరాత్రి పూజలు

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహార్ణవమిని పురస్కరించుకొని కాళరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక చండీహోమాలు, నిత్యహోమాలు, సామూహిక కుంకుమార్చనలు, త్రిశతి నామ కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలు, ఖడ్గమాలార్చనలు, నవారణ అర్చనలు, స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మహార్ణవమి రోజు వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టువారు అన్నమాచార్య సంకీర్తనలను అలపించారు. అదేవిధంగా నవమాతల అలంకరణలో కళాకారులు పలు ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. కళాకారులకు ఈఓ దీప్తి ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందజేశారు.

ఇరుముడుల సమర్పణ

దసర ఉత్సవాల్లో భాగంగా శ్రీజోగుళాంబ మాలధారణ చేసి స్వాములు ఇరుముడులు సమర్పించారు. స్థానిక సంగమేశ్వర ఆలయంలో స్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. అక్కడినుంచి ఆలయాలకు ఊరేగింపుగా వచ్చారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం జోగుళాంబ అమ్మవారి ఆలయానికి చేరుకొని ఇరుముడులు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ క్షేత్రానికి భారీగా తరలొచ్చి స్వామి, అమ్మవార్లును దర్శించుకున్నారు. ఆలయంలో సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement