అమరచింత: జూరాల జలాశయంపై అక్రమ రవాణాతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లతో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి నిర్ణయించింది. ఏడాదిన్నర కిందట మంత్రి వాకిటి శ్రీహరి, నాటి డీజీపీ డా.జితేందర్, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి భూమిపూజ చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేపట్టి బిల్లులు చెల్లించడం లేదని, తన ఆరోగ్యం సహకరించడం లేదని అర్ధాంతంగా వదలేశారు. దీంతో ఔట్‌పోస్టు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో మరుగునపడ్డాయి. అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పడం, స్థలాన్ని పరిశీలించడమే తప్పా అడుగు ముందుకు పడటం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అమరచింత మండలం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు పోలీస్‌స్టేషన్ అద్దె భవనంలోనే కొనసాగుతున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఔట్‌పోస్ట్‌తో మరింత రక్షణ..
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల జలాశయం వద్ద పోలీస్ ఔట్‌పోస్టును నిర్మించడంతో పలు ప్రయోజనాలు ఉంటాయని ఇరు జిల్లాల ప్రజల విశ్వాసం. జూరాల ప్రాజెక్టుపై నుంచి ఇరు జిల్లాలతో పాటు పక్క రాష్ట్రమైన కర్ణాటకకు సైతం వాహన రాకపోకలు కొనసాగుతాయి. అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలను తరలింపునకు చెక్‌పెట్టే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ సమీపంలో నిర్మించడంతో పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తు డ్రోన్ ద్వారా ప్రాజెక్టు పరిసరాల్లో జరిగే ఘటనలు తెలుసుకొని అప్పటికప్పుడే నివారించే అవకాశం ఉంది.
● అమరచింత మండలంలోని మస్తీపురం గ్రామవాసి అయిన ఐజీ రమేష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డిని కలిసి తమ ప్రాంతంలో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరడం.. ఇదే విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సైతం పట్టుబట్టడంతో నిధులు మంజూరయ్యాయి.
‘జూరాల’ వద్ద నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు
భూమిపూజ చేసి ఏడాదిన్నర పూర్తి.. నేటికీ బేస్‌మెంట్‌కే పరిమితం
బిల్లులు రాలేదంటూ తప్పుకున్న కాంట్రాక్టర్
రీటెండర్‌కు మరోమారు ప్రతిపాదనలు


