డిండి ప్రాజెక్టు రద్దుచేసే దాకా పోరాటం | - | Sakshi
Sakshi News home page

డిండి ప్రాజెక్టు రద్దుచేసే దాకా పోరాటం

Sep 28 2026 12:29 AM | Updated on Sep 28 2026 12:29 AM

నాగర్‌కర్నూల్‌/ కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి పాలమూరు రైతుల పాలిట శాపంగా మారిన డిండి ప్రాజెక్టును రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు. వంగూరు మండలం ఉల్పర నుంచి ఆదివారం ఉమ్మడి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ప్రొ.హరగోపాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. రైతులు ప్లకార్డులు చేతబూని పాలమూరు నీరు ఇక్కడి రైతులకే దక్కాలని.. నల్లగొండ జిల్లాకు తరలించొద్దని నినదించారు. అక్కడి నుంచి పాదయాత్ర కోనాపూర్‌కు చేరుకోగా.. ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం చేస్తున్న సాగునీటి సాధన ఉద్యమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రకటించారు. కోనాపూర్‌ నుంచి రంగాపూర్‌ మీదుగా ఎల్లికల్‌ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ ప్రజలకు పాదయాత్ర ప్రాధాన్యత, డిండి ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని జేఏసీ నాయకులు వివరించారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమంలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కల్వకుర్తి సమీపానికి చేరుకున్న పాదయాత్రలో ఎంపీ డీకే అరుణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి జేఏసీ నాయకులు చేరుకొని డీఏఓకు వినతిపత్రం అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వంత మండలం నుంచే రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రకు వివిధ గ్రామాల నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, గువ్వల బాలరాజు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, జేఏసీ నాయకులు వెంకట్‌గౌడ్‌, సదానందంగౌడ్‌, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement