స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పిల్లలమర్రి పిక్నిక్ సెంటర్‌లో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌ఓ నిర్మల మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలోని పిల్లలమర్రి, కోయిలసాగర్, మన్యంకొండ, కురుమూర్తి, కోయిలకొండ, శ్రీరామకొండ, మయూరి ఎకో పార్క్ వంటి తదితర అనేక పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారి నాగలక్ష్మి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
పాలమూరు: మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, ఇతర నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంతోపాటు వాటికి దూరంగా ఉండేలా చైతన్యం చేయాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగం, ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జనరల్ ఆస్పత్రిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతతోపాటు ఇతరులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి చేయాల్సిన అంశాలపై చైతన్యం తీసుకురావాలన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో యువతను అధికంగా భాగస్వామ్యం చేయాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శశికాంత్, వైద్యులు అనిల్‌రాజ్, ప్రోగ్రాం అధికారులు రాజు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.


