ఫ్లెక్సీ రగడ..
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి
నివాళులర్పిస్తున్న విప్,
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,
అదనపు కలెక్టర్ హరిప్రియ,
మేయర్ మమత తదితరులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జయంతిని పురస్కరించుకొని గ్రీన్‌బెల్ట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో ఎలాంటి పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆశపడకుండా తన శక్తినంతా రాష్ట్ర సాధనకే దారపోసిన గొప్ప రాజకీయ కర్మశీలి అని కొనియాడారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా నిజాయితీ, నిబద్ధత, త్యాగం, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నాటి ఉద్యమ సమయంలో తన ఇంటినే వేదికగా మార్చి పోరాట స్ఫూర్తిని రగిల్చారని, పాలకులు ఆ ఇంటిని కూల్చివేసినా న్యాయపోరాటం చేసి వచ్చిన పరిహారాన్ని కూడా మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసమే వెచ్చించారని గుర్తుచేశారు. బాపూజీతో కలిసి ఉద్యమంలో పాల్గొనడం తన అదృష్టమని, ఆయన చూపిన నిజాయితీ, నిష్ట నేటి రాజకీయ నాయకులకు, అధికారులకు స్ఫూర్తిదాయకమన్నారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఫొటో లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకులంటే అలుసా అని మండిపడ్డారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ హరిప్రియ, మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, కార్పొరేటర్లు వెంకటేష్, తాహేర్, రామస్వామి, ఎస్సీ సెల్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


