జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పేదలు వేసుకున్న గుడిసెలను తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మోతీనగర్‌లోని వడ్డెర బస్తీలో ఇటీవల కాలిపోయిన గుడిసెను శుక్రవారం ఆయన పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడిసెలను తొలగిస్తామని ఎవరైనా వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. పేదల గుడిసెల జోలికి వస్తే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. చెట్ల కింద జీవిస్తున్న పేదలకు గుడిసెలు వేసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడే ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోయిన గుడిసెకు తన సొంత ఖర్చుతో రేకులు వేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. గుడిసె కాలిన వెంటనే స్థానిక బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వచ్చి బాధిత కుటుంబానికి సహాయం అందించారని తెలిపారు. వడ్డెర బస్తీలో లైటింగ్ తదితర సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి పార్టీ కార్పొరేటర్లు అధికారులను కలిసి చర్యలు తీసుకుంటారని చెప్పారు. మాజీ ముడా చైర్మన్ వెంకన్న, కార్పొరేటర్ మధుమోహన్, సీనియర్ నాయకులు నరేష్, సిద్ధిక్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల గుడిసెల జోలికి వస్తే పోరాటం చేస్తాం
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ


