శోభాయాత్రకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు సర్వం సిద్ధం

Sep 23 2026 12:55 AM | Updated on Sep 23 2026 12:55 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథులు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలు ఊరేగింపుగా క్లాక్‌టవర్‌ చౌరస్తాకు చేరుకోనున్నాయి. అక్కడ పాలమూరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించనున్నారు. ఇందుకోసం క్లాక్‌టవర్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పటిష్ట భద్రత

హన్వాడ, దేవరకద్ర పెద్ద చెరువు, నగరంలోని పాలకొండ, మయూరి పార్క్‌ సమీపంలోని గంగుసాయి కృత్రిమ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేశారు. విగ్రహాల తరలింపు మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ, లైటింగ్‌, బారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు.

503 మందితో బందోబస్తు

శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ 503 మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక ఎస్పీ, ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 145 మంది, కానిస్టేబుళ్లు 212 మంది, హోంగార్డులు 98 మందికి విధులు కేటాయించారు. ప్రధాన కూడళ్లు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. మొబైల్‌, పెట్రోలింగ్‌ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహించనున్నాయి.

వాహనాల దారిమళ్లింపు

శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌ వైపు వెళ్లే వాహనాలు పిస్తాహౌస్‌ చౌరస్తా వద్ద బైపాస్‌ మీదుగా చించోళి బైపాస్‌–పీయూ–దేవరకద్ర వైపు వెళ్లాలి. కర్నూలు, భూత్పూర్‌, రాయచూర్‌ వైపు నుంచి కొడంగల్‌ వెళ్లే వాహనాలు చించోళి బైపాస్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. క్లాక్‌టవర్‌ కూడలి వద్ద అన్ని వైపుల నుంచి సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. గణేష్‌ నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

నగరంలో నేటి మధ్యాహ్నం

నుంచి శోభాయాత్ర

503 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు

క్లాక్‌టవర్‌ వద్ద ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు

బైపాస్‌ల మీదుగా వాహనాల దారి మళ్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement