గొల్లపల్లి వద్ద ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

గొల్లపల్లి వద్ద ఉద్రిక్తం

Sep 23 2026 12:55 AM | Updated on Sep 23 2026 12:55 AM

జడ్చర్ల టౌన్‌: జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు మంగళవారం జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద అరెస్టు చేశారు. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న మినర్వ హోటల్‌ వద్ద ఉదయం 8.30 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జడ్చర్ల సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ)కి తరలించి, మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. జూరాల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రాంచందర్‌రావు హైదరాబాద్‌ నుంచి జూరాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో గొల్లపల్లి వద్ద హోటల్‌లో అల్పాహారానికి ఆగగా, బీజేపీ రాష్ట్ర నాయకుడు శాంతికుమార్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్‌ ఆయనను జూరాలకు వెళ్లకుండా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రాంచందర్‌రావు ప్రశ్నించినప్పటికీ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని, దాని ముందు బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వైపు వచ్చే వాహనాలు కొద్దిసేపు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు బీజేపీ శ్రేణులను రహదారిపై నుంచి తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

అరెస్టు అప్రజాస్వామికం: ఆచారి

రైతులకు మద్దతుగా వెళ్తున్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఆచారి విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఆందోళనలను అణచివేసిందని, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాంచందర్‌రావును డీటీసీకి తరలించిన సమయంలో వనపర్తి, గద్వాల ప్రాంతాలకు చెందిన కొందరు రైతులతో ఆయన అక్కడే మాట్లాడారు. శాంతికుమార్‌, బాలత్రిపుర సుందరి, బాలకృష్ణ, మురళి, ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, ముచ్చర్ల కృష్ణయ్య, డోకూరి పవన్‌కుమార్‌, శ్రీవర్ధన్‌రెడ్డి, బాలవర్ధన్‌గౌడ్‌, అమర్‌నాథ్‌గౌడ్‌, సాహితీరెడ్డి, వెంకట్‌, శ్రీనాథ్‌, బుక్క నవీన్‌, రామకృష్ణ, తిరుపతి పాల్గొన్నారు.

జడ్చర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు

డీటీసీకి తరలింపు, మధ్యాహ్నం తర్వాత విడుదల

జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కమలం శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement