భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి

Sep 23 2026 12:55 AM | Updated on Sep 23 2026 12:55 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, భారత్‌ మాల జాతీయ రహదారి, రైల్వే లైన్‌ డబ్లింగ్‌, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ, పునరావాస కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. భారత్‌మాల, జాతీయ రహదారులు, రైల్వే లైన్‌ డబ్లింగ్‌, బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కర్మాగారం, కురుమూర్తి దేవాలయ అభివృద్ధి, ఎంజీకేఎల్‌ఐ, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పనుల భూ సేకరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌, భూత్పూర్‌, దేవరకద్ర మండలాల్లో రైల్వే భూ సేకరణకు సంబంధించిన అవార్డులు, పరిహారం చెల్లింపులు, ఖాతా ధ్రువీకరణ, కోర్టు కేసులు, వివాదాస్పద భూముల వివరాలను సమీక్షించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించి, కోర్టు కేసులు, ఇతర వివాదాలను స్పష్టంగా వర్గీకరించి నివేదికలు సమర్పించాలని సూచించారు. భూత్పూర్‌ మండలంలో భారత్‌మాల భూ సేకరణకు సంబంధించి భూ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. బ్రహ్మోస్‌ కర్మాగారానికి సంబంధించిన ప్రైవేట్‌ భూముల సర్వేను అదనపు సర్వేయర్లను నియమించి పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కురుమూర్తి దేవాలయ అభివృద్ధి, అమర్‌రాజా పరిశ్రమ రహదారి, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్‌ ప్రాజెక్టుల భూ సేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణలో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, జేఎల్‌బీ హరిప్రియ, ట్రెయినీ కలెక్టర్‌ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ రామిరెడ్డి, ఆర్‌డీఓ నవీన్‌, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement