రంజీకి పాలమూరు ఆల్‌రౌండర్‌ | - | Sakshi
Sakshi News home page

రంజీకి పాలమూరు ఆల్‌రౌండర్‌

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

హైదరాబాద్‌ జట్టులో చోటు దక్కించుకున్న రుత్విక్‌ యాదవ్‌

ఆఫ్‌స్పిన్‌తో వికెట్ల వేట.. ఎడమచేతి బ్యాటింగ్‌లోనూ మెరుపులు

సూపర్‌ సీనియర్‌ లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు

భారత జట్టుకు

ఎంపిక కావడమే లక్ష్యం

రంజీ ట్రోఫీకి ఎంపికకావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో తల్లిదండ్రులు ఎంతో ప్రోత్పహిస్తున్నారు. నేను హైదరాబాద్‌లోని క్రికెట్‌ స్కూల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న. కోచ్‌లు మాజీ భారత జట్టు ప్లేయర్‌ దినేష్‌ మోంగియా, అద్నాన్‌ బఫ్పాన్‌, గౌరవ్‌కుమార్‌ నాకు కోచింగ్‌ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా వికెట్లు తీసి, పరుగులు చేసి భారతజట్టుకు ఎంపికకావడమే లక్ష్యంగా పెట్టుకున్న.

– రుతిక్‌ యాదవ్‌, క్రికెటర్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరు యువ క్రికెటర్‌ మెండె రుత్విక్‌ యాదవ్‌ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. 2026–27 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుడిచేతి ఆఫ్‌స్పిన్నర్‌గా, ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న రుత్విక్‌.. ఇటీవలి ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సూపర్‌ సీనియర్‌ లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

చిన్ననాటి నుంచే ఆసక్తి

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన రుత్విక్‌ యాదవ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. పట్టుదల, క్రమశిక్షణతో పాటు నిరంతర సాధనతో ఆటలో రాణిస్తున్నాడు. హైదరాబాద్‌లోని క్రికెట్‌ స్కూల్‌ అకాడమీలో అన్న రాకేష్‌ యాదవ్‌తో కలిసి శిక్షణ పొందుతున్నాడు. హైదరాబాద్‌లో ఏఆర్‌ఏఎస్‌ఐగా పనిచేస్తున్న తండ్రి రమేష్‌ యాదవ్‌ అతడిని ప్రోత్సహిస్తున్నారు.

బంతితో పదునైన ప్రదర్శన

2024, 2025లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జట్టు తరఫున హెచ్‌సీఏ లీగ్‌లలో ఆడిన రుత్విక్‌.. హెచ్‌సీఏ అండర్‌–19 లీగ్‌లోనూ సత్తా చాటాడు. తిలక్‌వర్మ సారథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 2024 మెన్స్‌ అండర్‌–23 వన్డే ట్రోఫీ, కోల్‌ సీకే నాయుడు ట్రోఫీలోనూ ఆడాడు. గత ఏడాది కోల్‌ సీకే నాయుడు అండర్‌–23 ప్రాబబుల్స్‌లో మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అండర్‌–23 స్టేట్‌ మ్యాచ్‌లో విదర్భపై 68 పరుగులు చేశాడు.

ఈ ఏడాది మరింత దూకుడు

2026 సీజన్‌లో హెచ్‌సీఏ ఏ–డివిజన్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రుత్విక్‌.. ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయడంతో పాటు రెండు అర్ధసెంచరీలు సాధించాడు. ఇటీవల జరిగిన హెచ్‌సీఏ సీనియర్‌ మెన్స్‌ సూపర్‌ లీగ్‌లో టీమ్‌–ఈ తరఫున మూడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి టాప్‌–3 బౌలర్లలో నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు పడగొట్టడం విశేషం.

బౌలింగ్‌

ప్రాక్టీస్‌ చేస్తున్న

రుతిక్‌ యాదవ్‌

అక్టోబర్‌ 11 నుంచి రంజీ ట్రోఫీ

2026–27 రంజీ ట్రోఫీ అక్టోబర్‌ 11 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ జట్టుకు టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సారథ్యం వహించనున్నాడు. రంజీ జట్టులో రుత్విక్‌కు చోటు దక్కడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా క్రీడాభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement