క్షణికావేశం.. తీరని శోకం | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. తీరని శోకం

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

డ్రమ్స్‌ వివాదంలో తలకు గాయం

చికిత్స పొందుతూ యువకుడి మృతి

చివరికి అవయవదానం చేసి దాతృత్వం చాటుకున్న కుటుంబం

నిమిషం కోపం.. రెండు కుటుంబాల్లో విషాదం

మదనాపురం: క్షణికావేశం.. ఆలోచించే వ్యవధి ఇవ్వని క్షణికమైన కోపం ఓ పండుగ వేళ రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. వినాయక మండపం వద్ద పాటలకు డ్రమ్స్‌ వాయించే విషయంలో మొదలైన ఒక చిన్నపాటి తగవు, విచక్షణ మరచి ప్రవర్తించిన తీరుతో ఆ ఇంట్లో దీపం ఆరిపోయేలా చేసింది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, తోసివేతలు జీవితాలను ఎలా కూల్చివేస్తాయనడానికి మదనాపురం మండలం నెల్విడి తండాలో చోటు చేసుకున్న ఈ విషాదఘటనే నిదర్శనంగా నిలిచింది.

అసలేం జరిగింది?

స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈనెల 17వ తేదీ రాత్రి 8:45 గంటల ప్రాంతంలో నెల్విడి తండాలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద డ్రమ్స్‌ వాయించే విషయంలో తండాకు చెందిన నినావత్‌ తిరుపతినాయక్‌, బలరాం నాయక్‌ అన్నదమ్ములతో అదే తండాకు చెందిన మన్నెంనాయక్‌, సురేష్‌నాయక్‌, సోమ్లానాయక్‌, శివానాయక్‌ చిన్న గొడవకు దిగారు. పండుగ వాతావరణంలో సర్దుకుపోవాల్సిన గొడవ కాస్తా ఆవేశం పెరగడంతో పెద్దదైంది. ఈ క్రమంలో జరిగిన నెట్టివేత, దాడిలో బలరాం నాయక్‌ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.

మృత్యువుతో పోరాడి..

రక్తగాయాలైన బలరాం నాయక్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కొత్తకోట, ఆపై వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని కిమ్స్‌కు తరలించారు. అక్కడ కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడుతూ, మెద డు పనిచేయక శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

కంటిపాప పోయినా.. మరొకరికి వెలుగు

క్షణికావేశంలో జరిగిన దాడితో తమ ఆత్మీయుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడనే తీవ్ర దుఃఖంలోనూ ఆ కుటుంబం మహోన్నత దృక్పథాన్ని చాటుకుంది. కోమాలో ఉన్న బలరాం నాయక్‌ అవయవాలను దానం చేసేందుకు భార్య సువర్ణ, కుటుంబ సభ్యులు అంగీకరించారు. అవయవ దాన ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు.

ఆవేశం వద్దు.. ఆలోచించండి

చిన్నచిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై గొడవలకు దిగితే చివరకు అనుభవించేది తీరని వేదనే. ఒక్క నిమిషం కోపం ఒకరి ప్రాణాన్ని తీస్తే, మరోవైపు దాడిచేసిన వారి జీవితాలను జైలుపాలు చేస్తుంది. ప్రతిఒక్కరూ సహనంతో, ఆలోచనతో ప్రవర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఎస్‌ఐ జగదీశ్వర్‌ దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement