తల్లడిల్లిన.. తండా | - | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిన.. తండా

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

నవాబుపేట: రాత్రి డప్పుల మోత.. గణనాథుడి నిమజ్జనం.. తండావాసులతో కలిసి ఆనందంగా చిందులు.. ఆ సంబురాలు తెల్లవారకముందే విషాదంగా మారాయి. వినాయక నిమజ్జనం ముగించుకుని శంషాబాద్‌కు తిరిగి వెళ్తున్న నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో మెట్టుగడ్డ, నాగులదిన్నె తండాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుల్లో మాజీ సర్పంచ్‌ దంపతులు కెతావత్‌ జమునాబాయి (50), లింభ్యానాయక్‌ (55)తో పాటు మెట్టుగడ్డతండాకు చెందిన మాన్‌సింగ్‌నాయక్‌ (49), వసురాంనాయక్‌ (47) ఉన్నారు. అదే తండాకు చెందిన డ్రైవర్‌ ఆశోక్‌ (29) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నిమజ్జనం ముగించుకుని వెళ్తుండగా..

మెట్టుగడ్డతండా పంచాయతీ పరిధిలోని నాగులదిన్నె, మెట్టుగడ్డ తండాలకు చెందిన నలుగురు శంషాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వినాయక నిమజ్జనం కోసం స్వగ్రామానికి వచ్చిన వారు శనివారం తెల్లవారుజామున నిమజ్జనం ముగించుకుని శంషాబాద్‌కు బయలుదేరారు. నిమజ్జనంలో అలసిపోవడంతో వాహనంలో నిద్రలోకి జారుకున్న సమయంలో శంషాబాద్‌ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మజీ సర్పంచ్‌ జమునాబాయి, ఆమె భర్త లింబ్యానాయక్‌తో పాటు లింబ్యానాయక్‌ సోదరుడు మాన్‌సింగ్‌నాయక్‌ ప్రాణాలు కోల్పోయారు. జమునాబాయి–లింభ్యానాయక్‌ దంపతులకు ఇద్దరు కుమారులు వినోద్‌, సతీష్‌, కుమార్తె శాంతి ఉన్నారు. మాన్‌సింగ్‌నాయక్‌కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మరోమృతుడు వసురాంనాయక్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా.. మరో ఏడుగురు పిల్లలు తండ్రులను కోల్పోయారు.

35 ఏళ్ల క్రితం శంషాబాద్‌కు..

లింభ్యానాయక్‌ సుమారు 35 ఏళ్ల క్రితం చదువుల కోసం కాకుండా ఉపాధి కోసం శంషాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఇటుకల తయారీ కేంద్రంలో కూలీగా జీవితం ప్రారంభించి క్రమంగా ఆర్థికంగా ఎదిగారు. రాజకీయంగా బీఆర్‌ఎస్‌లో కొనసాగిన ఆయన సేవాలాల్‌ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా, బంజారాభవన్‌ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.

నిమజ్జనం సంబురాల నుంచి తిరిగి వెళుతుండగా.. నలుగురి దుర్మరణం

మృతుల్లో మాజీ సర్పంచ్‌ దంపతులు

ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.. మరో కుటుంబంలో విషాదం

మెట్టుగడ్డ, నాగులదిన్నె తండాల్లో విషాదం

రాత్రి ఉత్సాహంగా చిందులు..

నిమజ్జనం సందర్భంగా రాత్రి వరకు తండావాసులతో కలిసి ఉత్సాహంగా గడిపిన లింభ్యానాయక్‌ మరుసటి రోజే విగతజీవిగా మారడం స్థానికులను కలచివేసింది. రెండు తండాల్లో మృతదేహాలను అంత్యక్రియలకు తరలించిన సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. సంబురాలతో కళకళలాడిన తండాలు ఒక్క రాత్రిలోనే కన్నీటి సంద్రంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement