మహబూబ్‌నగర్ క్రైం: దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్‌స్టేషన్లను గుర్తించేందుకు కేంద్ర స్థాయిలో నిర్వహించే వార్షిక సర్వేకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ పోలీస్‌స్టేషన్ షార్ట్‌లిస్ట్ అయింది. ఇందులో భాగంగా ట్రాన్సురురల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సర్వే అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ బుధవారం కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని మౌలిక వసతులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారం, పోలీసుల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ సీఐ బి.గాంధీనాయక్, కోయిలకొండ ఎస్‌ఐ ఎ.నాగరాజు సర్వే అధికారికి స్వాగతం పలికారు.
కాల్వలో పడి
మత్స్యకారుడు మృతి
కొల్లాపూర్ రూరల్: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారు డు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జవాయిపల్లి చెరువుకు సాగునీరు వెళ్లే ప్రధాన కాల్వలో చో టుచేసుకుంది. సర్పంచ్ తెలుగు యాదన్నగౌడ్, బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెలుగు కృష్ణయ్య (39) బుధవారం తెల్లవారుజామున సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్ నుంచి జవాయిపల్లి గ్రామ చెరువుకు నీరు వెళ్లే ప్రధాన కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఎక్కువ సాగునీరు విడుదల చేయడం వల్ల ఆ తాకిడికి ఈ ప్రమాదం జరిగుండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ యాదన్నగౌడ్ విజ్ఞప్తి చేశారు.
జొన్న మిషన్‌లో ఇరుక్కుని తెగిన రైతు కాలు
మహబూబ్‌నగర్ క్రైం: జొన్నలు పట్టే మిషన్‌లో కంకులు వేస్తున్న క్రమంలో రైతు కాలు ప్రమాదవశాత్తు మిషన్‌లో తెగిపడిన ఘటన చోటు కుంది. వివరాలు.. కోయిలకొండ మండలంలోని కళ్యాన్‌నగర్‌తండాకు చెందిన రైతు ఉమ్లానాయక్ బుధవారం పొలంలో జొన్న కంకులు మిషన్‌లో వేస్తుండగా.. అతడి కాలు మిషన్‌లో ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో అతడి మోకాలు వరకు తెగిపోయింది. స్థానికులు క్షతగాత్రుడిని 108లో జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
వెల్దండ: మండల పరిధిలోని తిమ్మినోనిపల్లికి చెందిన కడమంచి అలివేలు (30) అనే వివాహిత అనుమానాస్పద మృతిపై తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగందర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలంకు కల్వకుర్తి తిమ్మరాశిపల్లికి చెందిన అలివేలుకు 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సదరు మహిళ మంగళవారం రాత్రి గ్రామంలోని వినాయకుడి వద్దకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ఇంటి సమీపంలో పడిపోయింది. గమనించిన గ్రామస్తులు భర్తకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త శ్రీశైలంతో పాటు కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ శారదా హరికిషన్ రూ.5వేలు అలాగే బీఆర్‌ఎస్ నాయకులు గండికోట రాజు రూ.2వేలు, ఉప్పట ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.


