● ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న కొన్ని గంటల్లోనే మృతి
● ‘మా టీచర్ ఎక్కడా..?’ అంటూ
కన్నీరుమున్నీరైన విద్యార్థులు
అమరచింత: నిన్నటి వరకు ఆమె ముఖంలో చిరునవ్వు.. చేతుల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం.. తోటి ఉపాధ్యాయుల అభినందనలు.. విద్యార్థుల ప్రేమాభిమానాలు. అంతలోనే విధి ఆమెను దూరం చేసింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కారం అందుకున్న మరుసటి రోజే గుండెపోటుతో మృతి చెందడంతో అమరచింతలో విషాదం నెలకొంది. అమరచింత మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆనందలక్ష్మి (48) మంగళవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారితో కలిసి ఫొటోలు దిగుతూ, సంతోషాన్ని పంచుకున్నారు. సన్మానం అనంతరం ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. అయితే అర్ధరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో భర్త రాము వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమీపంలోని డీఎంఆర్‌ఎం ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


