మహబూబ్‌నగర్ రూరల్: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి వృక్షాలుగా తీర్చిదిద్దినప్పుడే వనమహోత్సవానికి సార్థకత చేకూరుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం మెట్టుగడ్డలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ స్టేట్‌హోమ్ ఆవరణలో వనమహోత్సవం నిర్వహించారు. ఎంపీతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు నీరు పోయడం, పశువుల నుంచి రక్షించడం, ఎండాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వాటిని సంరక్షించాలన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతకు చెట్లు కీలకమన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రోజా, సీడీపీఓలు శైలాశ్రీ, రూప, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


