పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఎల్‌నినో నేపథ్యంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులను ఆదే శించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీసీ నిర్వహించిన ఆయన.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 30న జరిగే నీట్‌–పీజీ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వీసీలో డీఆర్‌ఓ నిర్మలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ కేసుల దర్యాప్తు

వేగవంతం చేయాలి

భూత్పూర్‌: పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ జానకి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం భూత్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, బాధితుల సమస్యలను పూర్తిగా విని చట్టపరమైన పరిష్కారం చూపాలని సూచించారు. పెండింగ్‌, గ్రేవ్‌ కేసులు, రౌడీషీట్లు, బైండోవర్‌ కేసులు, వారెంట్ల అమలు, బీట్‌ వ్యవస్థ, నేరస్థుల కదలికలపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రివేళ గస్తీ ముమ్మరం చేసి అనుమానిత వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ నాగన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రెండో బ్యాచ్‌లో జపాన్‌కు ఐదుగురు టీచర్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చేపట్టిన ఎడ్యుకేషన్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమంలో భాగంగా రెండో బ్యాచ్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జపాన్‌ పర్యటనకు ఎంపికయ్యారు. దేవరకద్ర ఎంపీహెచ్‌ఎస్‌ నుంచి నఫీజ్‌ఉన్నిసా బేగం, రాజాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి అతెం ప్రసంగి మోసెస్‌, నార్లోనికుంట ఎంపీపీఎస్‌ నుంచి నోమేశ్వర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ జీడిపల్లి తండా ఎంపీపీఎస్‌ నుంచి రఘురాంరావు, గద్వాల తిప్పరాల యూపీఎస్‌ నుంచి రవీందర్‌బాబు ఉన్నారు. వీరు వచ్చేనెల 19 నుంచి 26 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement