అడ్డాకుల జెడ్పీహెచ్‌ఎస్ పీఎం శ్రీ పాఠశాలలో 6 తరగతులకు 11 సెక్షన్లు ఉండగా 404 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ ముగ్గురు ఇంగ్లిష్ ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో ఒకరిని డిప్యుటేషన్‌పై పంపారు. మరో ఉపాధ్యాయురాలు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో పాఠశాలలో ఇంగ్లిష్ బోధనకు ఒక్క ఉపాధ్యాయురాలే పూర్తి స్థాయిలో మిగిలే పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సింది పోయి.. ఉన్నవారినే ఇతర పాఠశాలలకు పంపడం వల్ల బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో చేపట్టిన డిప్యుటేషన్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. జీఓ 25కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడం, సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇవ్వడం, మండల పరిధి దాటి ఇతర మండలాలకు పంపడం వంటి అంశాలు విమర్శలకు తావిస్తున్నాయి. మొత్తంగా 197 మందికి డిప్యూటేషన్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మండల స్థాయిలో అవసరాలను బట్టి చేపట్టాల్సిన సర్దుబాట్లు.. కొందరు ఉపాధ్యాయులను ఏకంగా ఇతర మండలాలకు పంపేలా మారాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గండేడ్ మండలంలోని ఓ జెడ్పీహెచ్‌ఎస్ నుంచి ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న ఉపాధ్యాయుడిని మిడ్జిల్ మండలానికి పంపడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే మహమ్మదాబాద్ మండలానికి చెందిన మరో సంఘం మండల అధ్యక్షుడిని నవాబ్‌పేటకు డిప్యుటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహమ్మదాబాద్ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హన్వాడ మండలం దోర్రితాండకు పంపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్లను మినహాయించి సీనియర్‌కు డిప్యుటేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహమ్మదాబాద్, గండేడ్, జానంపేట, సీసీకుంట తదితర మండలాల్లోనూ ఇలాంటి వ్యవహారాలపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సంఘాల నేతలే టార్గెట్?
డిప్యుటేషన్ల వ్యవహారంలో ఉపాధ్యాయ సంఘాల నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక సంఘానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. మరో సంఘానికి చెందిన నాయకులపై కక్షసాధింపు ధోరణితో డిప్యుటేషన్లు ఇచ్చారని కొందరు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓల స్థాయిలో చేసిన సర్దుబాట్లు మండల పరిధికే పరిమితం కావాల్సి ఉండగా.. జిల్లాస్థాయిలో కౌన్సెలింగ్ లేకుండా మండలాలు దాటి డిప్యుటేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
● మండలాల వారీగా చూస్తే నవాబ్‌పేటలో అత్యధికంగా 22 మంది, కోయిల్‌కొండలో 18, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 17, హన్వాడలో 15, భూత్పూర్‌లో 14 మందికి డిప్యుటేషన్లు ఇచ్చారు. అలాగే సీసీకుంటలో 12, దేవరకద్ర, మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్‌లలో 11 చొప్పున, అడ్డాకుల, మహమ్మదాబాద్, మూసాపేటలో 10 చొప్పున, బాలానగర్, గండేడ్‌లో 9 చొప్పున, మిడ్జిల్‌లో 8, జడ్చర్లలో 7, కౌకుంట్లలో 3 మందికి డిప్యుటేషన్లు ఇచ్చారు.
విద్యార్థులు ఎక్కువ.. టీచర్లు తక్కువ!
197 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు..
మండలాలు దాటి పంపడంపై విమర్శలు
ఎంఈఓల ఇష్టారాజ్యంపై ఆరోపణలు..
సంఘాల నేతలకు కక్షసాధింపు అంటూ విమర్శలు


