● పెండింగ్ ప్రాజెక్టులు
వెంటనే పూర్తి చేయాలి
● కరువును పారదోలేలా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలి
● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కృష్ణా నదిలో పాలమూరు జిల్లాకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను తేల్చాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 1989 నుంచి పాలమూరు పరిస్థితులను చూస్తున్నానని, అప్పట్లో ఆకలి చావులను చూసి చలించిపోయానన్నారు. జిల్లా కరువు, వలసలు, ఆకలి సమస్యలకు శాశ్వత పరిష్కారం కృష్ణా జలాల వినియోగమేనని, అందుకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు నీళ్ల సాధన కూడా ప్రధాన కారణమన్నారు. కృష్ణా నదిలో పాలమూరు ప్రజలకు హక్కుగా రావాల్సిన నీటిని దక్కేలా చర్యలు తీసుకోవాలని, కరువును పారదోలేలా ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఆయన.. కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే పనులను కూడా పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నల్లగొండకు కూడా నీరు అవసరమేనని, అయితే రెండు జిల్లాల మధ్య విభేదాలు సృష్టించేలా ప్రాజెక్టుల రూపకల్పన ఉండకూడదన్నారు. జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, పాలకుల నిర్లక్ష్యానికి జిల్లా రైతులు, ప్రజలు ఇంకెంతకాలం బలికావాలని ప్రశ్నించారు. పాలమూరును ఎండబెట్టి డిండి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి, జేఏసీ కోకన్వీనర్ బెక్కం జనార్దన్, వీరబ్రహ్మచారి, చెన్న కిష్టన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


