‘చిరుతలు’ చిక్కేనా..
● గండేడ్ మండలంలో చిరుతల కలకలం
● తరుచూ మూగజీవాలపై దాడి
● బోను ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం
గండేడ్: అటు పొలం పనులు చేసుకోలేక.. ఇటు జీవాలను కాయలేక మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందున్నారు. మన్సూర్‌పల్లి బొందెగట్టు శివారు ప్రాంతాల్లో ఏడాది కాలంగా చిరుతల సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మూగజీవాలతో పాటు తమపై ఎప్పడు దాడి చేస్తాయోనని బెంబేలెత్తిపోతున్నారు. అధికారుల అలసత్యం.. చిరుతల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.
● గత సోమవారం గండేడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు పకీరప్ప మేకలు మేపడానికి బొందెగట్టు ప్రాంతానికి వెళ్లాడు. మ ధ్యాహ్నం మేకలు దాహానికి కిందికి వచ్చాడు. తిరిగి పైకి వెళ్లేసరికి గుంపులో మూడు మేకలు కనిపించలేదు. వాటి కోసం వెతక గా కొద్ది దూరంలో చనిపోయి ఉన్నాయి. ఇదే సమయంలో చనిపోయిన మేకను అతని కళ్ల ముందే చి రుత లాక్కెళ్లింది. అటవీ అధికారులకు సమాచా రం అందించాడు. వారు వచ్చి పంచనామా నిర్వహించారు. కానీ చనిపోయిన మేకల కారణంగా అతని దాదాపు రూ. 30 వేలకు పైగా నష్టం వాటిల్లింది.
● కొండాపూర్ గ్రామానికి గొల్ల చిన్న వెంకటయ్య గ్రామ సమీపాన రాజగొండ వద్ద ఉన్న ఇతని పొలంలో పాలకోసం రెండు ఆవులు వ్యవసాయం కోసం రెండు ఎడ్లు పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే 15 రోజుల క్రితం మేత మేపిన పశువులను సాయంత్రం పాకలో కట్టెసి ఇంటికి వెళ్లాడు. ఉదయం పొలానికి వెళ్లి చూడగా లేగదూడ కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా చనిపోయింది. చిరుతదాడి చేసి సగం శరీరాన్ని తిని వదిలేసింది.
● ఇలా ఒకటి కాదు రెండు కాదు తరుచు మూగజీవాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన్సూర్‌పల్లి బొందెగట్టు ప్రాంతంలో గత కొంతకాలంగా చిరుతలు తిరుగాడుతూ మూగజీవాలను కబళించడంతో పాటు జనాన్ని బెంబేలు ఎత్తిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా ఇవి తిరుగాడుతూ ఉన్న అధికారుల్లో చలనం లేకుండా పోయింది.
బోను ఏర్పాటులో నిర్లక్ష్యం?
చిరుతలను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23న బొందెగట్టుపై మూడు చిరుతలు కనిపించాయి. మన్సూర్‌పల్లికి చెందిన రైతు ఏదుల బాలయ్య ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు వచ్చి వాటిని చూసారు. సెల్‌ఫోన్లలో సైతం చిత్రీకరించారు. ఫారెస్టు అధికారులకు సమాచారం అందడంతో వారు అదే రోజు సాయంత్రం చిరుత పులులను గమనించారు. స్పష్టంగా చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచా రం అందించారు. దీంతో ఫారెస్టు డివిజన్ అధికారి గణేష్, ఫారెస్టు రేంజర్, అప్పటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్ మరుసటి రోజు చిరుతలు సంచరించే ప్రదేశాన్ని పరిశీలించి అది చిరుతలకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. బోను ఏర్పాటుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ దాదాపు ఆరు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు బోను ఏర్పాటు చేయడం లేదు. నిబంధనలు అనుమతుల పేర కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు రేపంటూ దాటవేస్తున్నారు.
గతంలో కూడా..
2011 సంవత్సరంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత సంచరించి పలువురిని భయభ్రాంతులకు గురిచేసుంది. అప్పట్లో పలు గ్రామాలకు చెందిన రైతుల పశువులను చంపితిన్నాయి. బొందెగట్టు ప్రాంతంలో ఏదుల బాలయ్య పొలం వద్ద పట్టెందుకు చిరుతను పట్టెందుకు అప్పటి రేంజర్ లక్ష్మణ్ బోను ఏర్పాటు చేయించారు. మూడు నెలల తరువాత చిరుత బోనుకు చిక్కడంతో దానిని తీసుకెళ్లి జూపార్కు అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టుకు తరలించారు. తర్వాత ఏడాది నుంచి వాటి సంచారం తిరిగి మొదలైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో బోను ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టుకొని మూగజీవాలకు, తమకు తగిన రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.


