అలంపూర్ : పంట సాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరి సాగులో నారుమడి నుంచే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చీడపీడల నివారణకు అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. వరిలో యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
విత్తన శుద్ధి :
నారుమడి పోసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కార్భండిజంను 1 గ్రాము పొడి విత్తన శుద్ధికి 3 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి వాడుకోవాలి. తడి విత్తన శుద్ధిలో 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్భండిజంను లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండే కట్టి మొలకలను దంపనారు మడిలో చల్లుకోవాలి. విత్తన మోతాదు ఎకరాకు 20 నుంచి 25 కేజీలు సరిపోతుంది.
ఎరువుల యాజమాన్యం :
ఎకరాకు సరిపడే నారును 5 సెంట్లలో 2 కిలోల నత్రజని (5 కిలోల యూరియా), ఒక కిలో భాస్వరం (6కిలోల ఎస్.ఎస్‌పీ), ఒక కిలో పొటాషియం (2కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) ఇచ్చే ఎరువులను నారు వేసే ముందు చివర దమ్ములోనే వేసుకోవాలి. నత్రజని ఇచ్చే ఎరువులను తేలిక నేలల్లో అయితే రెండు సార్లు వేసుకోవచ్చు. ఒక కిలో నత్రజని విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు వేయాలి.
50 కిలోల యూరియాకి 10 కిలోల వేప పిండి లేక 250 కిలోల తేమ కలిగి న మత్తి కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకే సారి వేయాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం,అంకురం ఏర్పడే దశలో మిగితా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బులో కాకుండా దమ్ములోనే వేయడం మంచిది.
జింకు లోపం లక్షణాలు
పై నుంచి 3 లేక 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 వారాల్లో ముదురాకు చివర్లో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగానే ఉండదు.
నివారణ :
ప్రతి సీజన్‌లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్ కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు, తెగుళ్లు, మందులు కలిపి వాడరాదు. బోరు నీటిని వాడుతున్నట్లయితే ప్రతి రెండేళ్లకు ఒక సారి నీటి పరీక్ష చేయించాలి. ఒక వేళ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉన్నట్లయితే క్లిష్టమైన దశలో ఈ నీటిని పంటకు ఇవ్వకుండా ఆపివేయాలి.
దశ ఎరువు మోతాదు
(ఎకరాకు)
చివరి దమ్ము యూరియా 35 కిలోలు
ఎస్.ఎస్.పీ 150 కిలోలు
పొటాష్ 30 కిలోలు
దుబ్బు చేసే దశలో యూరియా 35 కిలోలు
అంకురం దశలో యూరియా 35 కిలోలు
పాడి–పంట


