అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని ఆమె సందర్శించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ.. ఆస్పత్రికి నియోజకవర్గంలోని నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారని.. కానీ సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యులు, స్టాఫ్‌నర్స్ కొరత ఉందన్నారు. రోగులకు సరిపడా మందులు సైతం అందుబాటులో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రభుత్వ తనిఖీలు తరచుగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రులను సందర్శించి ఇబ్బందులు తెలుసుకోవాలన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏమేలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మదనమ్మ, పద్మ, రాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
ఖిల్లాఘనపురం: ఎదురెదురుగా వస్తున్న ఆటో, మోట ర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన ఖిల్లాఘనపురం గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆగారం గ్రామానికి చెందిన ఎర్రప్ప, కర్రెన్న బైక్‌పై ఖిల్లాఘనపురం నుంచి గ్రామానికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన సాయికృష్ణ, ధనుష్, కృష్ణయ్య, చిట్టెమ్మ ఆటోలో ఆగారం నుంచి ఖిల్లాఘనపురం వస్తున్నారు. ఖిల్లాఘనపురం శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మోట్‌సైకిల్‌పై వెళ్తున్న ఎర్రప్ప, కర్రెన్నకు కాళ్లువిరిగిపోగా.. ఆటోలో ఉన్న ధనుష్‌కు తీవ్రరక్తగాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వెంటనే ఖిల్లాఘనపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు నిర్వహించిన డాక్టర్ సందీప్ మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.


