బల్మూర్: ప్రమాదవశా త్తు మెట్ల పై నుంచి జారి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొండనాగుల లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.కుటుంబసభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మూడవత్ పార్వతి (55) చిన్నపాటి హోట ల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో గ్రామంలోనే ఓ ఇంటిని అద్దె కు తీసుకొని భర్త బాలుతో పాటు తన ముగ్గు రు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటుంది. గురువారం ఇంటి పై నుంచి కిందికి దిగుతున్న క్రమంలో కాలు జారి కిందపడటంతో తల, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భార్యతో గొడవపడి..
చెరువులో దూకిన భర్త
కందనూలు: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూల్ చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చంద్రకల్ గ్రామానికి చెందిన బంగారయ్య (43) బోనాల పండుగ కోసం తన అత్తగారి గ్రామమైన నాగనూల్‌కు వచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకొని అతడు బయటకు వెళ్తున్నానని గురువారం ఇంటి నుంచి బయలుదేరాడు. అతడు చెరువులో దూకడానికి ప్రయత్నిస్తున్న సందర్బంలో గ్రామంలోని కొందరు యువకులు గమనించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు చెరువులో గాలింపు చేపట్టగా ఎక్కడ కనిపించలేదు. శుక్రవారం మృతదేహం చెరువు ఒడ్డుకు చేరుకుంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
బస్సు ఢీ: గుర్తు తెలియని మహిళ దుర్మరణం
ఎర్రవల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కోదండాపురం ఏఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. 44వ జాతీయ రహదారిపై బోరవెళ్లి స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ఓ గుర్తు తెలియని మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. గమనించిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య గౌడ్‌పై కేసు నమోదు చేశారు. మృతురాలి వయస్సు 40–45 ఏళ్లు ఉండొచ్చని, ఒంటిపై నలుపు రంగు బురఖా, నలుపు–తెలుపు పూల డిజైన్ చీర, నీలం రంగు జాకెట్, మెడలో తాయత్తు ఉన్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు కోదండాపురం పీఎస్‌లో సంప్రదించాలని ఏఎస్‌ఐ సూచించారు.
అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
అయిజ: మండలంలోని బింగుదొడ్డి శివారు భారతమాల వంతెన కింద మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. భారత్‌మాల వంతెన కింద మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ గురుస్వామి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ సోషల్ మీడియాలో పోస్టు చేయగా మృతుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందవరం మండలం కనికవీడు గ్రామానికి చెందిన రాఘవరెడ్డి(46)గా గుర్తించారు. పంచనామా నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


