మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఏడాది క్రితం ఆర్టీసీ శ్రామిక్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ సోమవారం ఆర్‌ఎం కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అప్రెంటిస్ చేసిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రకటించిన నోటిఫికేషన్ మేరకు తాము దరఖాస్తు చేసుకున్నామన్నారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో తమకు వెయిటేజీ ఇవ్వకుండా ఆర్టీసీలో అప్రెంటిస్ చేయని వారితోపాటు ప్రైవేట్ సంస్థలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. తాము రెండేళ్ల పాటు సంస్థలో అప్రెంటిస్ చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్నారు.


