● ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఘాతుకం?
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
చిరుత దాడిలో
మేకలు మృతి
గండేడ్: పట్టపగలు చిరుత మేకలపై దాడి చేయడంతో మూడు మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే గండేడ్ మండల పరిధిలోని కొండాపూర్‌కు చెందిన చెన్నారం పక్కీరప్ప పొలం దగ్గరే ఉంటూ మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారిలో భాగంగా సోమవారం మేకలను మేపడానికి వెళ్లాడు. రాయిని చెరువు సమీపంలోని బొందెగట్టులో మధ్యాహ్నం సమయంలో పక్కీరప్ప మేకలు మేస్తుండగా నీళ్లు తాగడానికి కిందికి వెళ్లాడు. ఈ క్రమంలో మేకలన్నీ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చాయి. దీంతో వెంటనే వెళ్లి చూడగా మూడు మేకలు చిరుతదాడిలో మృతి చెంది ఉన్నాయి. అందులో చనిపోయిన ఒకమేకను తన కళ్లుదుటే చిరుతపులి లాక్కెళ్లిందని పక్కీరప్ప తెలిపాడు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. మళ్లీ చిరుత కలకలం రేగడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళనకు గురువున్నారు.
పాముకాటుతో చిన్నారి మృతి
రాజోళి: పాముకాటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మండలంలోని పెద్దతాండ్ర పాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల కు మార్తె శ్రావ్య (8) కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పాము చిన్నారి వేలి కొరికింది. దీంతో చిన్నారి ఏడవడంతో మేల్కొన్న తండ్రి పామును గమనించి వేలు నుంచి దాన్ని విడదీసి, చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
పొలం వద్దకు వెళ్లిన రైతు..
రాజాపూర్: పొలం వద్దకు వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం ఉడిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి చంద్రమౌలి (59) పత్తి పంటను పరిశీలిస్తుండగా.. చేనులో ఉన్న నాగుపాము అతడి పాదంపై కాటువేసింది. గ్రామానికి చెందిన శివకుమార్ మోటర్‌సైకిల్‌పై చంద్రమౌలిని ఎక్కించుకొని బాలానగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.
కందనూలు: బిజినపల్లి మండలంలోని ఇప్పలతండాలో గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోరుసుగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ (50) శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కార్డు అందుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మరుసటి రోజు బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించారు.
దుర్వాసన రావడంతో..
ఆదివారం సాయంత్రం చిట్టెమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు అనుమానించి తలుపులు తెరిచి చూశా రు. ఇంట్లో ఆమె మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బిజినపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్టెమ్మ కొంతకాలంగా లట్టుపల్లి గ్రామంలోని ఓ రైస్‌మిల్లులో కూలీగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి ఎవరు వచ్చారు? ఏదైనా వ్యక్తిగత వివాదం ఉందా? దొంగతనం కోణం ఏమైనా ఉందా? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి ఎస్‌ఐ షంశుద్దీన్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా హత్యకు అసలు కారణం, నిందితుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఇప్పలతండాలో విషాదం నెలకొంది.


