● మహిళపై దూసుకెళ్లిన లారీ.. రెండుముక్కలైన శరీరం
● గడిమున్కన్‌పల్లిలో తెల్లవారుజామున ఘటన
దామరగిద్ద: కాలకృత్యాల కోసం బహిర్భూమికి వెళ్లిన మహిళ లారీ రూపంలో వచ్చిన మృత్యువుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన శనివారం తెల్లవారుజామున మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలంలోని గడిమున్కన్‌పల్లికి చెందిన కుర్వ ఉషెంతమ్మ(55) రోజూలాగే కాలకృత్యాల కోసం గ్రామ చివరన రోడ్డు సమీపానికి వచ్చింది. అదే సమయంలో సేడెం నుంచి నారాయణపేట వైపు వస్తున్న సిమెంట్ లారీ రోడ్డు పక్కనే కూర్చున మహిళ పైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెంది. శరీరం రెండు ముక్కలైంది. లారీ డ్రైవర్ వాహనాన్ని ఎవరూ చూడలేదని నిలపకుండా నారాయణపేటలో సిమెంట్ అన్‌లోడింగ్‌కు తరలించారు. మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డుపై బైఠాయించి మహిళ మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్‌ఐ నరేష్, తహసీల్దార్ తిరుపతయ్య ఘటనా స్థలానికి చేరుకొని భరోసా కల్పించారు. లారీని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుంభం శివకుమార్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20వేలు, లారీ ఓనర్ రూ.25వేలు ఆర్థిక సాయం అందజేశారు.


