మదనాపురం: చేపల వేటే ఆ యువకుడి జీవనాధారం. రోజులాగే నది ఒడ్డున వల విసురుతుండగా.. ఊహించని విధంగా మృత్యువు మొసలి రూపంలో దాడి చేసింది. క్షణాల వ్యవధిలో మొసలి దవడల నుంచి చాకచక్యంగా, అదృష్టవశాత్తు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ భయాందోళనకర ఘటన మదనాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. గోపన్‌పేటకు చెందిన మత్స్యకారుడు మహేష్ చేపల వేట కోసం సమీపంలో ఉన్న రామన్‌పాడు జలాశయం వెనక జలాలు కొత్తపల్లి వంతెన పైభాగంలో థర్మకోల్ తెప్పపై ఉండి చేపలు వేట చేస్తున్నాడు. ఈ క్రమంలో నీటి లోపల ఉన్న ఒక పెద్ద మొసలి ఒక్కసారిగా బయటకు వచ్చి అతడిపై దాడి చేసింది. నోట్లో కరుచుకొని నీటిలోకి లాగేందుకు యత్నించింది. దీంతో దాని నుంచి రక్షించాలని యువకుడు పక్కనున్న తోటి మత్స్యకారులను పిలిచాడు. వారు సకాలంలో స్పందించి మొసలి నోటి నుంచి రక్షించారు. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రామన్‌పాడు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
● మొసలి నోటికి చిక్కి
త్రుటిలో తప్పించుకున్న మత్స్యకారుడు
● రామన్‌పాడు జలాశయంలో
చేపల వేటకు వెళ్లగా ఘటన


