అంతఃకరణశుద్ధితోనే సనాతన ధర్మరక్షణ | - | Sakshi
Sakshi News home page

అంతఃకరణశుద్ధితోనే సనాతన ధర్మరక్షణ

Aug 10 2026 1:22 AM | Updated on Aug 10 2026 1:22 AM

జడ్చర్ల టౌన్‌: అంతఃకరణశుద్ధితోనే సనాతన ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు పిలుపునిచ్చారు. సనాతన ధర్మపరిరక్షణ అలియన్స్‌ కమిటీ నిర్వాహకులు చంద్రారెడ్డి, శ్రీగిరిక్షేత్రం పీఠాధిపతి కృష్ణాస్వామి నేతృత్వంలో ఆదివారం శ్రీగిరిక్షేత్రంపై నిర్వహించిన సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, వక్తలు హాజరై ప్రసంగించారు. సనాతన బోర్డు రావాలని వక్తలు ముక్తకంఠంతో తీర్మానించారు. ధర్మ పరిరక్షణ అనేది మాటల్లో కాకుండా ప్రతి ఒక్కరి దినచర్యలోనే మార్పురావాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో ప్రతి అమ్మాయిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అంతర్యుద్ధం మొదలైందని, హిందువులు మేలుకోవాలన్నారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించటం అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మానవ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి చిన్నతనం నుంచే నేర్పించాలని అప్పుడే కొంతైనా మార్పు సాధ్యమన్నారు. ధర్మం వైపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులుంటేనే పిల్లలు మారుతారని గుర్తుంచుకోవాలన్నారు. ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, ధర్మపరిరక్షణకు నడుంబిగించిన వారే పాలకవర్గంలో చైర్మన్‌గా, సభ్యులుగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉందని, అందుకు హిందువులంతా ఏకమైతే సాధ్యమవుతుందన్నారు. ఆలయాల్లో వారానికి ఒక్కసారైనా అందరు కలసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించాలన్నారు. జ్ఞానం ఉన్నవారే ఎక్కువగా మోసాలకు పాల్పడుతుండటం విచారణకరమన్నారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సాధు సంతులు శివరుద్రస్వామి (జగద్గిరిగుట్ట కేదార్‌నాథ్‌ క్షేత్రం పీఠాధిపతి), సోమేశ్వరస్వామి (నాగోల్‌), రుద్రశివానంద మౌన సరస్వతి స్వామి (శ్రీశైలం), యోగేష్‌ ప్రభు, రఘుప్రోలు జనార్దన స్వామి (సాతాపూర్‌), జగద్గురు భగవత్‌ మహారాజ్‌స్వామి (జంబుద్వీపం రిషికేష్‌), దీక్షిత్‌ సుబ్రహ్మణ్యం (ఫిమేల్‌సింగర్‌), పరమానంద (గంగాపురం), జయరాం, రాఘవేంద్రస్వామి, రజనిరమ, మదన్‌గుప్త, నేరెళ్ల మాల్యాద్రి, పద్మాకర్‌ ఆచార్యులు, యమునపాటక్‌, కృష్ణానందస్వామి, నాయకులు, విష్ణుసహస్రనామ పారాయణ బృందం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement